Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోనూ 'తలపతి' మార్క్.. సీఎం విజయ్ 'సినీ స్టైల్' ప్రయోగాలు వర్కవుట్ అవుతాయా?

తాజాగా ఆయన చెన్నై నగరంలో ఎటువంటి హడావుడి లేకుండా, ఒక సాధారణ పౌరుడిలా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ఎక్కారు.

By:  A.N.Kumar   |   26 Jun 2026 9:23 PM IST
రాజకీయాల్లోనూ తలపతి మార్క్.. సీఎం విజయ్ సినీ స్టైల్ ప్రయోగాలు వర్కవుట్ అవుతాయా?
X

తమిళ చిత్రసీమలో 'తలపతి'గా కోట్లాది మంది గుండెల్లో గుడి కట్టుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలతో మమేకమవుతున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలో లాగే నిజ జీవితంలోనూ ఆయన చూపిస్తున్న 'సినీ స్టైల్' పొలిటికల్ అప్రోచ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆర్టీసీ బస్సులో సామాన్యుడిగా సీఎం.. సోషల్ మీడియాలో వైరల్

ముఖ్యమంత్రి అంటే సాధారణంగా భారీ కాన్వాయ్, కఠినమైన భద్రతా వలయాలు గుర్తుకు వస్తాయి. కానీ సీఎం విజయ్ వీటన్నింటికీ భిన్నంగా సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. తాజాగా ఆయన చెన్నై నగరంలో ఎటువంటి హడావుడి లేకుండా, ఒక సాధారణ పౌరుడిలా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ఎక్కారు. టికెట్ కొని ప్రయాణం.. బస్సు ఎక్కిన విజయ్, కొలత్తూరు వరకు సాధారణ ప్రయాణికుడిలా చిల్లర డబ్బులు ఇచ్చి మరీ టికెట్ కొనుగోలు చేశారు. ప్రయాణ సమయంలో బస్సులోని పరిస్థితులను, ప్రజా రవాణా వ్యవస్థ తీరును ఆయన స్వయంగా తన మొబైల్‌లో వీడియో తీస్తూ కనిపించారు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి. "ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల రవాణా వ్యవస్థను ప్రత్యక్షంగా అనుభవించడం, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవడానికి ఒక మంచి పరిణామం" అంటూ నెటిజన్లు, ప్రజలు ఆయన సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

డ్రగ్స్ వ్యతిరేక మారథాన్‌లో 'తలపతి' పరుగు

కేవలం బస్సు ప్రయాణానికే పరిమితం కాకుండా సమాజంలో పేరుకుపోతున్న ప్రధాన సమస్యలపై కూడా విజయ్ దృష్టి సారించారు. చెన్నై నగరంలో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఒక భారీ అవగాహన మారథాన్‌లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. వేలాది మంది యువతీ యువకులు, సాధారణ ప్రజలతో కలిసి విజయ్ స్వయంగా పరుగెత్తడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే బలమైన సందేశాన్ని యువతలోకి తీసుకెళ్లడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది ప్రజాకర్షక విధానమా? నిజమైన మార్పునా?

సినిమాల్లో ప్రజా సమస్యలపై పోరాడే పాత్రల్లో కనిపించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలోనూ అదే తరహా ప్రజాకర్షక విధానాన్ని కొనసాగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ ప్రజల్లోకి వెళ్లడం.. వినూత్న ప్రయోగాలు చేయడం, నేరుగా ప్రజలతో మమేకం కావడం వంటి చర్యలు ఆయన పాలనకు ప్రారంభంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే విజయ్ చూపిస్తున్న ఈ చురుకుదనం, వినూత్న శైలి తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వేడిని రగిల్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఆయన పరిపాలన ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.