టీవీకేఎల్పీ నేతగా 'దళపతి' ఏకగ్రీవ ఎన్నిక.. ఇక సీఎంనే..
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే ముందు విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ పరిణతిని చాటుతున్నాయి.
By: A.N.Kumar | 5 May 2026 3:39 PM ISTతమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించబడింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముసాయిదాను మారుస్తూ, వెండితెర 'దళపతి' విజయ్ తన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీతో ప్రభంజనం సృష్టించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, అశేష జనవాహిని ఆకాంక్షలకు ప్రతిరూపంగా విజయ్ శాసనసభాపక్ష (టీవీకే ఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది.
విలువల పునాదిపై విజయ యాత్ర
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే ముందు విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ పరిణతిని చాటుతున్నాయి. ఎమ్మెల్యేల కీలక భేటీకి వెళ్లే ముందు ఆయన సామాజిక విప్లవకారుడు పెరియార్ ఈ.వి. రామస్వామి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. ఇది కేవలం ఒక లాంఛనప్రాయమైన చర్య కాదు.. తన ప్రభుత్వం 'సమానత్వం', 'సామాజిక న్యాయం' అనే పునాదులపై నిర్మించబడుతుందని ప్రజలకు ఇచ్చిన బలమైన సందేశం. ద్రవిడ మూలాలను గౌరవిస్తూనే మార్పును ఆకాంక్షించే ఆధునిక రాజకీయాలను ఆయన ప్రతిబింబిస్తున్నారు.
అఖండ మెజారిటీ దిశగా అడుగులు
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లు సాధించడం ద్వారా టీవీకే తన సత్తా చాటింది. మేజిక్ ఫిగర్ (118) కు చేరువలో ఉన్న విజయ్, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతును పొందేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ల పట్ల ఉన్న వ్యతిరేకతను, తనకున్న ఇమేజ్‌ను ఓట్లుగా మలుచుకోవడంలో విజయ్ విజయవంతమయ్యారు. యువత, మహిళలు, అట్టడుగు వర్గాల మద్దతు ఈ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆశాజనకమైన పాలన.. విశ్లేషకుల అంచనా
సినిమాల్లో అన్యాయాన్ని ఎదిరించే కథానాయకుడిగా కనిపించే విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ప్రజా సమస్యలపై పోరాడే 'నాయకుడిగా' బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. యువతకు ఉపాధి కోసం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక పారిశ్రామిక విధానం... అవినీతి రహిత పాలనను అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు... సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా వినూత్న పథకాలు విజయ్ మేనిఫెస్టోలో ఉన్నాయి..
తమిళ రాజకీయాలు ఎప్పుడూ భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత వంటి నటులు రాజకీయాల్లో రాణించిన చరిత్ర ఉన్న ఈ గడ్డపై ఇప్పుడు విజయ్ తనదైన ముద్ర వేయబోతున్నారు. "ప్రజల తీర్పే భగవంతుడి తీర్పు" అని నమ్మే విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏ మేరకు రాణిస్తారో చూడాలి. రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం కోసం.. అలాగే ఆయన తీసుకోబోయే మొట్టమొదటి సంతకం దేనిపై ఉంటుందనే ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మొత్తానికి తమిళనాడులో 'విజయ్ యుగం' అధికారికంగా ప్రారంభమైంది!
