బీజేపీతో దళపతి కలుస్తాడా? జన నాయగన్ మదిలో ఏముంది?
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అధికార డీఎంకేని గద్దె దించాలని బీజేపీ పావులు కదుపుతోంది.
By: Tupaki Political Desk | 6 Oct 2025 4:00 AM ISTతమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అధికార డీఎంకేని గద్దె దించాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా విస్తృత జనాదరణ కలిగిన సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ పావులు పక్కాగా ప్లాన్ చేస్తోందని అంటున్నారు. గత వారం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తున్న బీజేపీ.. అదే సమయంలో దళపతిని వెనకేసుకొచ్చేలా ప్రకటనలు చేస్తోంది. దీంతో విజయ్ తో స్నేహం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్య కొన్ని దశాబ్దాలుగా అధికార యుద్ధం కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఈ ద్వైపాక్షిక యుద్దాన్ని త్రిముఖ పోరుగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే గత ఏడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు. భారీ జనసమూహంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. అయితే దళపతి ఎంతలా ప్రయత్నించినా రెండు వర్గాలుగా చీలిపోయిన తమిళ ఓటర్లను ప్రసన్నం చేసుకుని అధికారం దక్కించుకోవడం అంత ఈజీ కాదన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు పార్టీల కూటముల్లో ఏదో ఒకదానిలో విజయ్ చేరితే.. అధికారం దక్కడం ఖాయం అన్న అభిప్రాయ వ్యక్తమవుతోంది.
అధికార డీఎంకే జాతీయస్థాయిలో కాంగ్రెస్ మిత్రపక్షంగా కొనసాగుతుండగా, ఏఐడీఎంకే ఈ మధ్య కాలంలోనే మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టింది. ఇక తమిళనాట ద్రావిడ రాజకీయాల స్థానంలో జాతీయ భావం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకే పార్టీని ఓడించాలంటే అన్నాడీఎంకే కూటమి శక్తి మాత్రమే చాలదని, తమకు విజయ్ తోడుగా నిలిస్తే తమిళనాట కాషాయ పార్టీ మద్దతు ఉన్న పార్టీల కూటమి అధికారం సాధిస్తుందని అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో గత వారం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఉదంతం నుంచి విజయ్ ను బయటపడేసేందుకు స్వచ్ఛందంగా ముందుకువస్తోంది బీజేపీ.
కరూర్ తొక్కిలసాటలో సుమారు 41 మంది మరణించగా, ఘటనకు కారణమైన పలువురిని ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఇదే సమయంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ పై కేసు నమోదు చేయకపోవడాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఈ పరిణామం ప్రభుత్వానికి పెద్ద ఓదార్పుగా నిలిచిందని అంటున్నారు. దీంతో విజయ్ పాత్ర తేల్చేందుకు సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే సిట్ ద్వారా విజయ్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. విజయ్ ను ఒంటరిని చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే ఆయన ఒంటరి కాదన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని తమిళనాడు బీజేపీ ప్రకటనలు చేస్తోంది.
దీంతో కమలం పార్టీ ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరూర్ ఘటన తర్వాత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న విజయ్ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాను బీజేపీ, డీఎంకే పార్టీలకు సమదూరం పాటిస్తానని గతంలోనే విజయ్ ప్రకటించారు. అయినా ఆయనతో స్నేహం కోసం బీజేపీ ఎడతెగని ప్రయత్నాలు చేయడమే ద్రవిడ రాజకీయాన్ని రంజుగా మార్చుతుందని అంటున్నారు.
