Begin typing your search above and press return to search.

ఘోరం: రన్నింగ్ ట్రైన్ పై పడిన క్రేన్.. షాకింగ్ గా మృతుల సంఖ్య!

అవును... థాయిలాండ్ లోని బ్యాంకాక్ నుండి ఈశాన్య ప్రావిన్స్ కు వెళ్తున్న రైలుపై నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.

By:  Raja Ch   |   14 Jan 2026 1:53 PM IST
ఘోరం: రన్నింగ్ ట్రైన్ పై పడిన క్రేన్.. షాకింగ్ గా మృతుల సంఖ్య!
X

రన్నింగ్ ట్రైన్ కు పట్టాలపై చిన్న స్క్రూ లూజ్ అయినా, చిన్న ఇనుప ముక్క పట్టాలపై అడ్డంగా ఉన్న అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అంటారు. అలాంటిది రన్నింగ్ లో ఉన్న ట్రైన్ పై హఠాత్తుగా ఓ క్రేన్ జారిపడితే ఆ ఘోరం ఏ స్థాయిలో ఉంటుంది..? తాజాగా థాయిలాండ్ లో ఈ ఘోరమే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. కదులుతున్న రైలుపై ఓ క్రేజ్ జారి పడటంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

అవును... థాయిలాండ్ లోని బ్యాంకాక్ నుండి ఈశాన్య ప్రావిన్స్ కు వెళ్తున్న రైలుపై నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 22 మంది మృతి చెందగా, 30 మంది వరకూ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బ్యాంకాక్ కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్ లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

ఈ సందర్భంగా.. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్లో.. రైలుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో.. పట్టాలు తప్పిన బోగీలలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సహా విపత్తు ప్రతిస్పందన విభాగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ మరియు సహాయ చర్యలను చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా స్పందించిన థాయిలాండ్ రవాణా మంత్రి ఫిఫాట్ రట్చకిత్ప్రాకర్న్... ప్రమాదం జరిగిన రైలులో సుమారు 195 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితులను గుర్తించడానికి, గాయపడిన వారికి వైద్య సహాయం అందించడానికి అధికారులు కృషి చేస్తున్నరని.. గాయపడినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఉందని అన్నారు! ఈ రైలుపై కూలిపోయిన క్రేన్.. $5.4 బిలియన్ల విలువైన హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా చెబుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన నఖోన్ రట్చసిమా ప్రావిన్స్ లోని స్థానిక పోలీసు చీఫ్ థాచపోన్ చిన్నవాంగ్... ఆ రైలు థాయిలాండ్ లోని ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్ కు వెళ్తుందని.. ఈ సమయంలో హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుపై పని చేస్తున్న ఓ క్రేన్ దానిపై కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో 22 మంది మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.