Begin typing your search above and press return to search.

లాటరీ తీస్తేనే భవితవ్య నిర్ణయం…థాయ్‌లాండ్‌ యువతలో టెన్షన్!

ఈ నిర్బంధ సైనిక సేవలో చేరిన వారికి ప్రభుత్వం తరఫున మంచి వసతి, ఆహారంతో పాటు నెలకు సుమారు 11,000 బాట్ అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 31,000 పైన జీతంగా ఇస్తారు.

By:  Madhu Reddy   |   13 Jun 2026 6:00 AM IST
లాటరీ తీస్తేనే భవితవ్య నిర్ణయం…థాయ్‌లాండ్‌ యువతలో టెన్షన్!
X

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా థాయ్‌లాండ్‌లో ఒక వింతైన, భయానకమైన సైనిక ఎంపిక పద్ధతి ఉంది. అక్కడ ప్రతి ఏటా ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు, యువకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కేవలం ఒకే ఒక్క లాటరీ కార్డు వారి జీవితాన్ని, భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. కంబోడియాతో సరిహద్దు ఘర్షణలు నడుస్తున్న నేపథ్యంలో, ఈ ఏడాది జరుగుతున్న సైనిక నియామక లాటరీ మరింత ఉత్కంఠగా మారింది. చావుబతుకుల మధ్య సాగే ఈ లాటరీ ప్రక్రియ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ విశేషాలు చూద్దాం..

రెడ్ కార్డు వస్తే ఆర్మీ.. బ్లాక్ వస్తే హ్యాపీ:

థాయ్‌లాండ్‌లో 21 ఏళ్లు నిండిన ప్రతి పురుషుడు సైన్యంలో పనిచేయాలనే కఠినమైన నిబంధన ఉంది. ఇందుకోసం ఆర్మీ అధికారుల సమక్షంలో ఒక పెద్ద జాడీలో కార్డులు ఉంచుతారు. 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు ఒక్కొక్కరుగా వచ్చి అందులోంచి ఒక కార్డు తీయాలి. ఒకవేళ 'రెడ్ కార్డు' వస్తే రెండేళ్ల పాటు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. అదే 'బ్లాక్ కార్డు' వస్తే సైనిక సేవ నుండి విముక్తి లభిస్తుంది.

భయంతో వణకడం.. సంతోషంతో గంతులేయడం:

ఈ లాటరీ ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం మామూలుగా ఉండదు. అధికారులు కార్డు రంగును అనౌన్స్ చేయడమే ఆలస్యం.. రెడ్ కార్డు వచ్చిన వారు అక్కడికక్కడే కుప్పకూలిపోతూ, ఏడుస్తూ కనిపిస్తారు. ఇక అదే బ్లాక్ కార్డు వచ్చిన వారు తామేదో లాటరీ గెలిచినట్లు గాల్లోకి ఎగురుతూ, సంతోషంతో డాన్సులు వేస్తారు. కార్డు రంగును బట్టి క్షణాల్లో మారిపోయే ఈ ఎమోషన్స్ చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి.

కఠినమైన శారీరక పరీక్షలు:

లాటరీలో పాల్గొనే ముందు యువకులకు కఠినమైన శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం 160 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు. ఇక అధికారులు యువకుల చొక్కాలు విప్పించి, టేపులతో ఛాతిని, చెక్క కొలబద్దలతో ఎత్తును పక్కాగా కొలుస్తారు. ఇక తరువాత హైస్కూల్‌లో మూడేళ్ల సైనిక శిక్షణ తీసుకోని వారంతా ఈ డ్రాకు హాజరుకావడం తప్పనిసరి.

జీతభత్యాలు ఎంత ఇస్తారంటే?:

ఈ నిర్బంధ సైనిక సేవలో చేరిన వారికి ప్రభుత్వం తరఫున మంచి వసతి, ఆహారంతో పాటు నెలకు సుమారు 11,000 బాట్ అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 31,000 పైన జీతంగా ఇస్తారు. ఇది థాయ్‌లాండ్ కనీస వేతనం కంటే కొంచెం ఎక్కువే. ఒకవేళ ఎవరైనా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఉంటే వారి సర్వీస్ కాలాన్ని ఒక ఏడాదికి తగ్గిస్తారు. ఇక అదే స్వచ్ఛందంగా ఆర్మీలో చేరిన వారికి కేవలం ఆరు నెలల సర్వీస్ మాత్రమే ఉంటుంది.

మినహాయింపులు కూడా ఉంటాయి:

అయితే అందరికీ ఈ లాటరీ కష్టాలు ఉండవు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, ఇంట్లో కుటుంబ సంరక్షణ చూసుకునే బాధ్యత ఉన్నవారికి రూల్స్ ప్రకారం ఏటా మినహాయింపులు ఇస్తారు. కానీ, ఎలాంటి సమస్యలు లేని సాధారణ యువకులు మాత్రం కచ్చితంగా ఈ ఉత్కంఠభరితమైన లాటరీ పరీక్షను ఎదుర్కోవాల్సిందే.

ఒక కార్డు రంగు మనిషి జీవితాన్ని మార్చేస్తుందనేది వినడానికి వింతగా ఉన్నా.. థాయ్‌లాండ్ యువతకు ఇది ప్రతి ఏటా ఎదురయ్యే ఒక అగ్నిపరీక్ష. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న ప్రస్తుత తరుణంలో, ప్రాణాలను పణంగా పెట్టి దేశ సేవ చేయాలా వద్దా అనేది కేవలం ఆ దేవుడిపై మరియు ఆ లాటరీపైనే ఆధారపడి ఉంది. ఇక ఏదేమైనా థాయ్‌లాండ్‌లోని ఈ వినూత్న సైనిక విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది.