Begin typing your search above and press return to search.

బ్యాంకాక్ ట్రిప్ పేరుతో ఉచ్చు.. ముగ్గురు భారతీయ పర్యాటకుల కిడ్నాప్.. చివరికిలా..

విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయ పర్యాటకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ థాయ్‌లాండ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

By:  A.N.Kumar   |   29 July 2026 12:35 PM IST
బ్యాంకాక్ ట్రిప్ పేరుతో ఉచ్చు.. ముగ్గురు భారతీయ పర్యాటకుల కిడ్నాప్.. చివరికిలా..
X

విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయ పర్యాటకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ థాయ్‌లాండ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన బ్యాంకాక్, పట్టాయా పర్యటన పేరుతో ముగ్గురు భారతీయులను దారుణంగా మోసగించి కిడ్నాప్ చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు వారిని వారం రోజుల పాటు బంధించి, విమోచన ధనం కోసం భౌతికంగా చిత్రహింసలకు గురిచేశారు. చివరికి థాయ్ పోలీసుల సమయస్ఫూర్తి, సాహసోపేత చర్యతో ఆ ముగ్గురు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు.

తక్కువ ధర ఆశ చూపి ఉచ్చులో పడేశారు

పోలీసుల కథనం ప్రకారం.. ముగ్గురు భారతీయ పర్యాటకులు సుమారు రూ.1.99 లక్షల విలువైన 7 రోజుల పట్టాయా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుని.. జూలై 21న థాయ్‌లాండ్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ట్యాక్సీలో పట్టాయాకు వెళ్లిన వారికి అక్కడ ఒక భారతీయ వ్యక్తి ఎదురయ్యాడు. తక్కువ ఖర్చుకే నాణ్యమైన వసతి కల్పిస్తానని నమ్మబలికి వారిని ఒక్కొక్కరిగా తన మోటార్‌సైకిల్‌పై ఒక నివాస ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడికి చేరుకోగానే ముందే సిద్ధంగా ఉన్న ఒక ముఠా వారిపై విరుచుకుపడింది. బాధితుల చేతులు, కాళ్లు కట్టేసి ఒక ఇంట్లో బంధించింది. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి, వారిని విడుదల చేయాలంటే భారీ మొత్తంలో రాన్సమ్ విమోచన ధనం చెల్లించాలని డిమాండ్ చేసింది. డబ్బు కోసం ఒత్తిడి తెచ్చే క్రమంలో బాధితులను తీవ్రంగా కొడుతూ శారీరకంగా నరకయాతనకు గురిచేశారు. దాదాపు వారం రోజుల పాటు బాధితులు ఆ బంధీఖానాలో ప్రాణభయంతో గడిపారు.

థాయ్ పోలీసుల హైటెక్ దర్యాప్తు.. సురక్షిత రక్షణ

బాధితుల్లో ఒకరి కుటుంబ సభ్యుడు భారతదేశం నుంచి థాయ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న వెంటనే రక్షణ చర్యలు చేపట్టిన పోలీసులు, కిడ్నాపర్లు వాడిన ఫోన్ నంబర్లను ట్రాక్ చేశారు. ఆ నంబర్లు దుబాయ్‌లో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, అత్యాధునిక డిజిటల్ ట్రాకింగ్, లొకేషన్ డేటా సాంకేతికతను ఉపయోగించి వారు ఉన్న స్థలాన్ని పక్కాగా గుర్తించారు.

పోలీస్ ప్రత్యేక బృందం 'మ్యాప్ టాటో రోడ్' ప్రాంతంలోని సదరు ఇంటిపై హఠాత్తుగా దాడి చేసి ముగ్గురు భారతీయులను క్షేమంగా రక్షించింది. అయితే పోలీసులు చేరుకునే కొద్ది నిమిషాల ముందే నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వారి కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఎంతకాలంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.

విదేశీ పర్యాటకులకు నిపుణుల.. పోలీసుల హెచ్చరికలు

ఈ ఘటన నేపథ్యంగా విదేశాలకు వెళ్లే పర్యాటకులకు నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునే ముందు సంబంధిత ఏజెన్సీ విశ్వసనీయతను, లైసెన్స్‌ను సరిచూసుకోవాలి. విదేశాల్లో తక్కువ ధరలకు ఆఫర్లు ఇస్తామంటూ వచ్చే తెలియని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. బ్యాంకాక్, పట్టాయా వంటి ప్రాంతాల్లో రవాణా, వసతి కోసం కేవలం అధికారికంగా గుర్తింపు పొందిన సేవలను మాత్రమే వినియోగించుకోవాలి. పర్యటనలో మీ ప్రతి కదలికను , లొకేషన్‌ను కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి.

ఒక్క చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున.. విదేశీ పర్యటనల్లో పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.