Begin typing your search above and press return to search.

తెలంగాణకు టీజీ.. టీజీ వెంకటేశ్ చెప్పిన లాజిక్ ఇదే

తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాలపై విమర్శలు, పాలనలో తీసుకుంటున్న చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

By:  A.N.Kumar   |   14 Sept 2026 5:41 PM IST
తెలంగాణకు టీజీ.. టీజీ వెంకటేశ్ చెప్పిన లాజిక్ ఇదే
X

తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాలపై విమర్శలు, పాలనలో తీసుకుంటున్న చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయన గురించి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. రేవంత్‌రెడ్డి పేరులోనే ఒక ప్రత్యేకమైన అర్థం ఉందని చెప్పిన ఆయన.. తెలంగాణకు ఆయన వెలుగులా మారాలని ఆకాంక్షించారు.

ఉప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీజీ వెంకటేశ్‌.. రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని సూర్యుడితో పోల్చారు. ‘రేవంత్‌’ అనే పేరుకు ప్రకాశవంతమైన అనే అర్థం వస్తుందని చెప్పారు. సూర్య భగవానుడు ప్రపంచానికి వెలుగును అందించినట్లే.. రేవంత్‌రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు ప్రకాశవంతుడిగా ఉండి సేవా కార్యక్రమాల వైపు ప్రజలను తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై టీజీ వెంకటేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మాటల్లో కనిపించేంత కఠినత్వం ఆయన చేతల్లో కనిపించదని అన్నారు. ఒకవేళ ఆయన మాటల్లో ఉన్న స్థాయిలో కఠినంగా వ్యవహరించి ఉంటే తెలంగాణలో ఈరోజు ఎంతో మంది జైలుకు వెళ్లేవారని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

‘టీజీ’ పేరుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించిన టీజీ వెంకటేశ్‌.. ‘టీజీ’ అనే తన పేరుకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పూర్వీకులు తెలంగాణ నుంచే వచ్చారని.. అందుకే మా ఇంటి పేరు టీజీగా స్థిరపడిందని.. ఇప్పుడు అదే టీజీని తెలంగాణకు రేవంత్ పెట్టడం మాపేరు పెట్టినట్టుగా ఉందని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందనే భావనను ఆయన వ్యక్తం చేశారు.

వైశ్యులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి

రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ఆర్యవైశ్యుల సమస్యలను కూడా టీజీ వెంకటేశ్‌ ప్రస్తావించారు. ఆర్యవైశ్యులు అందరితో మంచిగా ఉంటారని, దైవ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే వివిధ పదవుల్లో వైశ్యుల వాటాను మరింత పెంచాలని ఆయన కోరారు. సమాజ సేవలో ముందుండే ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పదవుల్లో కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.

ఆత్మగౌరవ భవనానికి భారీ విరాళం

ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తన వంతు సహకారాన్ని ప్రకటిస్తూ టీజీ వెంకటేశ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే.. మరోవైపు ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని కోరడం, ఆత్మగౌరవ భవనానికి భారీ విరాళం ప్రకటించడం ద్వారా టీజీ వెంకటేశ్‌ ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి పేరులోని అర్థాన్ని ప్రస్తావిస్తూ ఆయనను వెలుగుతో పోల్చడం.. అదే సమయంలో ఆయన కఠినత్వంపై వ్యాఖ్యలు చేయడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా మారింది.