కల్తీ రాయుళ్లకు 'క్యూరా'.. రేవంత్ మార్క్ 'టీజీ-సేఫ్' డోసు!
ఇప్పటిదాకా ఫుడ్ సేఫ్టీ వాళ్లు ఒకవైపు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) వాళ్లు ఇంకోవైపు.. ఎవరి దారి వారిదే అన్నట్లు తనిఖీలు చేసేవారు.
By: A.N.Kumar | 17 Aug 2026 11:17 AM ISTకల్తీ ఆహారం తిని కడుపు నొప్పి తెచ్చుకోవడం.. ఆ నొప్పి తగ్గడానికి వేసుకునే మందు కూడా నకిలీదే అయి దేవుడి దయ మీద ఆధారపడటం.. ఇదీ మన హైదరాబాద్‌లో ఇటీవల సాగుతున్న అసలైన ‘లైఫ్‌స్టైల్’.. పానీపూరీలో కెమికల్స్, బిరియానీలో రంగులు, మెడికల్ షాపుల్లో ఏవో వింత ఔషధాలు.. ఇలా ప్రతీ దాంట్లోనూ కల్తీ మహారాజులు తమ మార్క్ చూపిస్తున్నారు. అయితే ఈ ‘కల్తీ లీలల’కి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ఒక మాంచి ప్లాన్ వేసింది. అదే టీజీ-సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్). స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం గారు ఇచ్చిన ఈ అనౌన్స్‌మెంట్‌తో కల్తీ బాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండాలి.
ఇప్పటిదాకా ఫుడ్ సేఫ్టీ వాళ్లు ఒకవైపు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) వాళ్లు ఇంకోవైపు.. ఎవరి దారి వారిదే అన్నట్లు తనిఖీలు చేసేవారు. ఒకరు ఆహారాన్ని పట్టుకుంటే.. ఇంకొకరు నకిలీ టాబ్లెట్లను పట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి 'TG-SAFE' తయారు చేశారు. అంటే ఇకపై కల్తీ రాయుళ్లకు రెట్టింపు ట్రీట్‌మెంట్ లభించబోతోందన్నమాట.. అయితే ఈ రెండింటి చట్టపరమైన అధికారాలు మాత్రం దేనికవే ఉంటాయట. కేవలం సమన్వయం కోసం మాత్రమే ఈ విలీనం అని స్పష్టం చేశారు.
ఈ కొత్త వ్యవస్థకు నాయకుడిగా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతిని నియమించారు. ఆల్రెడీ డీసీఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయనకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చేశారు. అంటే సింగిల్ విండో సిస్టమ్‌లా ఒకే పోలీస్ బాస్ ఇటు ఆహారాన్ని, అటు ఔషధాలను పర్యవేక్షిస్తారన్నమాట.
ఈ టీజీ సేఫ్ లో డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్, ల్యాబ్‌లు, అడ్మినిస్ట్రేషన్ అని మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి. ముందుగా ఈ ప్రయోగాన్ని ఎక్కువ హోటళ్లు, ఫార్మా కంపెనీలు ఉన్న ‘క్యూర్’ ప్రాంతంలో మొదలుపెడతారట. అక్కడి ఫలితాలు చూశాక రాష్ట్రమంతా విస్తరిస్తారు.
ప్రభుత్వం ఆలోచనైతే చాలా బాగుంది. తనిఖీలు వేగవంతం అవ్వడం, ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం వల్ల నాసిరకం ఉత్పత్తులు త్వరగా బయటపడతాయని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త 'టీజీ సేఫ్' దెబ్బకు కల్తీ రాయుళ్లు తమ దుకాణాలు సర్దేస్తారా లేక ఈ అథారిటీని కూడా ఎలా దాటాలో కొత్త రూట్ కనుక్కుంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ప్రజారోగ్యంతో ఆటలాడేవారికి రేవంత్ సర్కార్ వేసిన ఈ బిగ్ స్టెప్ ఎలాంటి ‘సేఫ్’ ల్యాండింగ్ ఇస్తుందో చూడాలి.
