‘గీతం’ మీద అంత ప్రేమేంది? రూ.118 కోట్లు బకాయిలా?
గుర్తుండని కారణంగా కానీ ఊళ్లో లేకున్నా.. ఇతర ఒత్తిళ్లలో ఉండి నెలసరి విద్యుత్ బిల్లు కట్టనంతనే.. విద్యుత్ కనెక్షన్ ను తొలగించటం చాలామందికి అనుభవమే.
By: Garuda Media | 17 Dec 2025 10:34 AM ISTగుర్తుండని కారణంగా కానీ ఊళ్లో లేకున్నా.. ఇతర ఒత్తిళ్లలో ఉండి నెలసరి విద్యుత్ బిల్లు కట్టనంతనే.. విద్యుత్ కనెక్షన్ ను తొలగించటం చాలామందికి అనుభవమే. రూ.500.. రూ.వెయ్యి బిల్లుకే విద్యుత్ శాఖ అధికారులు ఇంతలా సీరియస్ అవుతున్న వేళ.. గీతం వర్సిటీ లాంటి సంస్థ ఏకంగా రూ.118 కోట్ల బకాయిలు ఉన్నప్పటికి ఎలాంటి చర్యా తీసుకొని విద్యుత్ అధికారుల తీరు తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగర శివారులోని గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ వర్సిటీ రూ.118 కోట్ల భారీ విద్యుత్ బకాయి పడినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోని తీరుపై హైకోర్టు న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
‘‘నామమాత్రపు బకాయిలున్నా పేద వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తారు. తొలగించే ముందు వినియోగదారులకు ఎలాంటి నోటీసు పంపరు. అలాంటిది రూ.118 కోట్లు బకాయిలు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోని వైనం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పదవుల్లో ఉన్నోళ్ల కోసం ఒక చట్టం.. పేదవారి కోసం మరో చట్టాన్ని విద్యుత్ అధికారులు రూపొందించారా? దశాబ్దాలుగా బిల్లు చెల్లించకుండా విద్యుత్ సేవలు పొందటం దిగ్భ్రాంతికరం. 2008-09 నుంచి బకాయిలు పేరుకుపోయాయి. వర్సిటీకి విద్యుత్ సరఫరా వెంటనే నిలిపేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా.. అధికారులు మాత్రం నోటీసులు జారీకే పరిమితయ్యారు’’ అంటూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
గీతం వర్సిటీ విద్యుత్ బిల్లుల బకాయిల కేసును విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక.. ఈ సందర్భంగా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో తమ ఇంటికి రూ.800 బకాయి ఉంటే అధికారులు విద్యుత్ సరఫరా ఎలా నిలిపివేశారో గుర్తు చేసుకున్న ఆయన.. ‘‘సామాన్య ప్రజలకు ఓ నీతి. ఆర్థికంగా ఉన్న వారికో నీతా?’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్సిటీకి విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో వివరించటానికి తదుపరి విచారణ తేదీన ఆపరేషణ్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేశారు.
రూ.118 కోట్ల బకాయిల్ని చెల్లించాలని.. లేదంటే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని గత సెప్టెంబరులో సంబంధిత ఇంజనీర్.. గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సదరు నోటీసులను సవాలు చేస్తూ గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఇరు వర్గాల వాదనల్ని వింది. ఈ సందర్భంగా బకాయిల తీరుపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీర్ఘకాలిక బకాయిలున్నా.. గీతం వర్సిటీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పు పట్టారు.
