Begin typing your search above and press return to search.

హిందూ ఫోబియా.. అమెరికాలో నిరసన సెగ మొదలైంది!

టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటన, అమెరికాలో ముఖ్యంగా వలస వ్యతిరేక (anti-immigrant) ధోరణులు బలంగా ఉన్న ప్రాంతాలలో హిందూఫోబియా మరియు భారతీయ-వ్యతిరేక జాత్యహంకారం పెరుగుతున్న తీరును స్పష్టం చేస్తోంది.

By:  A.N.Kumar   |   28 Oct 2025 11:02 AM IST
హిందూ ఫోబియా.. అమెరికాలో నిరసన సెగ మొదలైంది!
X

ఇర్వింగ్ నగరంలో 'టేక్ యాక్షన్ టెక్సాస్’ (Take Action Texas) అనే పేరుతో ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు హిందూ దేవతలు, పండుగలను లక్ష్యంగా చేసుకుంటూ హిందూఫోబిక్ బోర్డులు ప్రదర్శించారు. వారి నినాదాలు, బానర్‌లలోని ద్వేషపూరిత సందేశాలు హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి. ‘‘విదేశీ రాక్షసులను తిరస్కరించండి.. నా టెక్సాస్‌ను ఇండియా చేయవద్దు.. H-1B స్కామర్లను దేశం నుండి బహిష్కరించండి..’’ అంటూ నినాదాలు చేశారు.

ఈ బ్యానర్‌లలో హిందూ దేవతలైన విష్ణు, గణేశులను రాక్షసులుగా చూపించే చిత్రాలు కూడా ఉన్నాయి, వాటిపై ఎరుపు రంగు 'X' గుర్తును ఉంచారు. ఈ సమూహం దీపావళిని గతంలో “రాక్షసుల పండుగ”గా, హిందూ ఆచారాలను “దెయ్యాల ఆరాధన”గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

*హిందూ సంస్థల తీవ్ర స్పందన

ఈ అవమానకర చర్యపై Coalition of Hindus of North America (CoHNA) తీవ్రంగా స్పందించింది. ఇర్వింగ్ నగర పరిధిలోని హిందువుల భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని.. బాధ్యులపై తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సంస్థతో పాటు, హిందూ అమెరికన్ కౌన్సిల్ కూడా ఈ సంఘటనను ఖండిస్తూ H-1B వీసాల విమర్శగా మొదలైన ఈ ద్వేషం ఆన్‌లైన్ హిందూఫోబియా, భారతీయులపై జాత్యహంకారంగా మారిందని, ఇది మరింత తీవ్రం కాకముందే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

విస్తృత ఆందోళన

టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటన, అమెరికాలో ముఖ్యంగా వలస వ్యతిరేక (anti-immigrant) ధోరణులు బలంగా ఉన్న ప్రాంతాలలో హిందూఫోబియా మరియు భారతీయ-వ్యతిరేక జాత్యహంకారం పెరుగుతున్న తీరును స్పష్టం చేస్తోంది. గతంలో కాలిఫోర్నియాలోని దేవాలయాలపై జరిగిన దాడులు, ప్లేనో (టెక్సాస్) పార్కింగ్ లాట్‌లో భారతీయ అమెరికన్ మహిళలపై జరిగిన దుర్భాష దాడి వంటి సంఘటనలు హిందూ సమాజంలో భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ద్వేషపూరిత చర్యలు మతసామరస్యాన్ని దెబ్బతీసి, అల్పసంఖ్యాకులలో భయాన్ని పెంచుతున్నాయి. సమాజం, ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు ఈ ధోరణిని అరికట్టడానికి పరస్పర గౌరవం, సహనం, శాంతి వాతావరణాన్ని ప్రోత్సహించడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.