హెచ్-1బీ వీసాలను నిలిపేయండి.. గవర్నర్ సంచలన ఆదేశాలు
అమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న విదేశీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు టెక్సాస్ రాష్ట్రం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.
By: A.N.Kumar | 28 Jan 2026 7:47 PM ISTఅమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న విదేశీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు టెక్సాస్ రాష్ట్రం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం టెక్సాస్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ నిపుణుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
కీలక ఆదేశాలు.. కాలపరిమితి
గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విభాగం కూడా కొత్తగా హెచ్-1బీ వీసా స్పాన్సర్‌షిప్ చేయకూడదు.ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని మే 31, 2027 వరకు కొనసాగుతాయి.టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుండి ముందస్తు లిఖితపూర్వక అనుమతి పొందితే తప్ప, ఎటువంటి కొత్త దరఖాస్తులు దాఖలు చేయడానికి వీల్లేదు.
ఈ నిర్ణయానికి గల కారణాలు
ఫెడరల్ హెచ్-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగం అవుతోందని గవర్నర్ అబాట్ అభిప్రాయపడ్డారు. "పన్ను చెల్లింపుదారుల డబ్బుతో సృష్టించబడిన ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత అమెరికన్లకే ఉండాలి. హెచ్-1బీ ప్రోగ్రామ్ అనేది అమెరికన్ వర్క్‌ఫోర్స్‌కు తోడ్పాటు అందించడానికి ఉండాలి తప్ప, స్థానిక కార్మికులను భర్తీ చేయడానికి కాదు" అని ఆయన స్పష్టం చేశారు.
నివేదిక సమర్పణకు గడువు
ప్రభావితమైన ప్రతి ప్రభుత్వ సంస్థ మార్చి 27, 2026 లోపు పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నివేదికలో కొన్ని అంశాలున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న హెచ్-1బీ ఉద్యోగుల సంఖ్య, వారి హోదాలు కీలకంగా ఉన్నాయి.. వారు ఏ దేశం నుండి వచ్చారు.. వారి వీసా గడువు ఎంతవరకు ఉంది? ఆయా ఉద్యోగాల కోసం స్థానిక టెక్సాస్ వాసులను సంప్రదించినట్లు సమాచారం.
ఎవరిపై ప్రభావం పడుతుంది?
ఈ నిర్ణయం ప్రధానంగా టెక్సాస్‌లోని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు , వైద్య కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రొఫెసర్లు , పరిశోధకులు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసే నిపుణులు. .. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న విదేశీ డాక్టర్లు. స్కూల్ డిస్ట్రిక్టులలో పనిచేసే స్పెషలైజ్డ్ టీచర్లపై ప్రభావం పడనుంది.
ట్రంప్ విధానాల కొనసాగింపు
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన "అమెరికన్ ఉద్యోగాలు - అమెరికన్లకే" అనే నినాదాన్ని ప్రతిబింబించేలా గవర్నర్ అబాట్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వలస విధానాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం ద్వారా స్థానిక నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ త్వరలో ఈ ఆదేశాల అమలుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అప్పటి వరకు కొత్తగా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఇది పెద్ద అడ్డంకిగానే మారనుంది.
