Begin typing your search above and press return to search.

మనోళ్ల ఫ్యామిలీని బలి తీసుకున్న అమెరికన్ కు 65 ఏళ్లు జైలు

ఇంతకూ అసలేమైందంటే? అమెరికాలోని టెక్సాస్ లో 2023 డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   11 Nov 2025 11:42 AM IST
మనోళ్ల ఫ్యామిలీని బలి తీసుకున్న అమెరికన్ కు 65 ఏళ్లు జైలు
X

దాదాపు రెండేళ్ల క్రితం (సరిగ్గా చెప్పాలంటే రెండు నెలలు తక్కువ 2 ఏళ్లు) అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తెలుగు ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి కుటుంబం బలైంది. అందుకు కారణమైన నిందితుడికి అమెరికా కోర్టు సంచలన శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇంతకూ అసలేమైందంటే? అమెరికాలోని టెక్సాస్ లో 2023 డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న ముమ్మిడివరంలో టింబర్ వ్యాపారి పొన్నాడ నాగేశ్వరరావు కుటుంబం అమెరికాకు వెళ్లింది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చిన్నాన్నే ఈ పొన్నాడ నాగేశ్వరరావు. ఈ వ్యాపారి కుటుంబానికి చెందిన ఆరుగురు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఈ ఘోర యాక్సిడెంట్ లో నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్ (44) మాత్రం బయటపడ్డాడు. కానీ.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు.. ఆయన సతీమణి.. కూతురు.. ఇద్దరు మనమలు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న కారు టెక్సాస్ నుంచి డల్లాస్ కు వెళ్లే మార్గంలో అమితమైన వేగంతో వచ్చిన కారు బలంగా గుద్దుకోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన టెక్సాస్ యువకుడు లూక్ గెరట్స్ ను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా ముగిసిన కోర్టు విచారణలో నిందితుడ్ని దోషిగా తేల్చిన అక్కడి న్యాయస్థానం.. ఈ అమెరికన్ కు 65 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఈ తీర్పును అమెరికాకు చెందిన మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఈ తీర్పును చూసిన తర్వాత.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణలు తీసే వారికి ఈ తరహాలో తీవ్రమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడైనా బాధ్యతతో డ్రైవింగ్ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. మన ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదానికి కారణమైన బాధ్యులకు విధించే శిక్షల్ని ఎప్పుడు సవరిస్తారో?