మస్క్ మావా.. ఏంటిది? ఎగిరే కారు బుకింగ్‌కే రూ.2.50 కోట్లా!
సాధారణంగా ఏదైనా కారు బుక్ చేసుకోవాలంటే కొద్దివేలు లేదా లగ్జరీ కార్లయితే కొన్ని లక్షలు అడ్వాన్స్ ఇస్తాం.
By: A.N.Kumar | 19 Oct 2026 10:18 AM ISTకారు కొనాలంటే రూ.2.50 కోట్లు ఖర్చు పెడతారంటే అర్థం ఉంది. కానీ "ఒక్క నిమిషం ఆగు బాస్.. అసలు కారు షోరూమ్‌లోకి రావడానికి నువ్వు దాంట్లో కూర్చోవడానికి ముందే కేవలం బుకింగ్ అమౌంట్ కింద రూ.2.50 కోట్లు ఇవ్వు" అంటే ఎలాంటి వాడికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మావా మార్కెట్లోకి తీసుకురాబోతున్న 'టెస్లా రోడ్‌స్టర్ థ్రస్ట్' వేరియంట్ చూస్తుంటే సరిగ్గా ఇలాగే అనిపిస్తోంది.
బుకింగ్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే
సాధారణంగా ఏదైనా కారు బుక్ చేసుకోవాలంటే కొద్దివేలు లేదా లగ్జరీ కార్లయితే కొన్ని లక్షలు అడ్వాన్స్ ఇస్తాం. కానీ మస్క్ మావా లెక్కలే వేరు. టెస్లా రోడ్‌స్టర్ థ్రస్ట్ వేరియంట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి అక్షరాలా రూ. 2,50,25,000 చెల్లించాలట..
ఇందులో డ్రామా ఏంటంటే.. ముందుగా రూ.5.01 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కేవలం 10 రోజుల్లో మిగిలిన రూ.2.45 కోట్లు కట్టేయాలి.. ఇక నార్మల్ ‘పర్ఫార్మెన్స్’ వేరియంట్ అయితే కాస్త జాలిపడి కేవలం రూ.50.06 లక్షల అడ్వాన్స్‌తో సరిపెట్టేశారట. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇది కారు అసలు ధర కాదు.. కేవలం "నేను కారు కొంటాను బాబోయ్" అని పీటల మీద కూర్చోవడానికి కట్టే రిజర్వేషన్ డిపాజిట్ మాత్రమే. పన్నులు, మిగిలిన కారు ధర అదనంగా కట్టాల్సిందే.
అసలు కారు గాల్లో ఎగురుతుందా?
టెస్లా చెప్తున్న వివరాల ప్రకారం... ఈ థ్రస్ట్ వేరియంట్లో రాకెట్లకు వాడే 'యాక్సిలరేషన్ థ్రస్టర్లు' ఉంటాయట. ఇవి కారును రాకెట్ వేగంతో ముందుకు తోస్తాయి. అయితే థ్రస్టర్లు అనగానే కారు విమానంలా ఆకాశంలో ఎగిరిపోతుందని కలలు కనకండి.. ఇది రోడ్డుపై దూసుకెళ్లే రాకెట్ కారే తప్ప.. మీ ఇంటి మేడపై వాలే ఫ్లైయింగ్ కార్ కాదు. ఇవన్నీ చాలవన్నట్లు సింగిల్ సీట్ ఉండే ‘రాకెట్ వేరియంట్’ లో పూర్తి ఫ్లైయింగ్ సిస్టమ్ ఉంటుందని మరో సైన్స్ ఫిక్షన్ కథ ప్రచారంలో ఉంది.
2028లో ప్రొడక్షన్.. భారత్‌కు వచ్చేది ఎప్పుడో?
సరే అప్పులు చేసి రూ.2.50 కోట్లు అడ్వాన్స్ కట్టేద్దాం అనుకున్నా.. కారు చేతికి వచ్చేది ఎప్పుడో తెలుసా? 2028లో ఉత్పత్తి ప్రారంభమవుతుందట. అదీ కూడా మొదట లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉన్న దేశాలకే.. మరి మన భారతదేశంలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కదా.. మన దగ్గరకు ఈ కారు వచ్చేసరికి ఎన్ని ఏళ్లు పడుతుందో మస్క్ మావాకే తెలియాలి. పైగా మన ఇండియాలో ఉండే గుంతల రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలకు ఈ థ్రస్ట్ ఫీచర్లు ఎంతవరకు పర్మిషన్ పొందుతాయో కూడా పెద్ద ప్రశ్నే..
కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
మీ దగ్గర బాగా డబ్బులుండి బుక్ చేసుకుందాం అనుకుంటే ఇవి తెలుసుకోవడం మంచిది.. రూ.2.50 కోట్లు కేవలం అడ్వాన్స్ మాత్రమే.. కారు పూర్తి ధర కాదు. బుకింగ్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగొస్తాయా లేదా అనేది రూల్స్ జాగ్రత్తగా చదవాలి. 2028 ప్రొడక్షన్ అంటే డెలివరీకి ఇంకా టైమ్ పడుతుంది. మన ఇండియన్ ఆర్టీవో అనుమతులు లభిస్తాయా లేదా అనేది పెద్ద అనుమానం.
"కారు లేకపోయినా పర్లేదు కానీ డిపాజిట్తోనే కంపెనీకి కోట్ల ఫండ్స్ పోగుచేయడం ఎలా" అనేది మస్క్ మావాను చూసే నేర్చుకోవాలి. భవిష్యత్తు సాంకేతికత పేరిట ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ వసూలు చేయడం నిజంగా ఒక విచిత్రమే కదా..
