ఎగిరే కారు తెస్తున్నా: ఎలాన్ మస్క్ మరో సంచలనం
ప్రముఖ జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్, టెస్లా నుంచి 'ఎగిరే కారు' ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.
By: A.N.Kumar | 2 Nov 2025 10:55 AM ISTటెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. పేరు వింటేనే విప్లవాత్మక ఆవిష్కరణలు గుర్తొస్తాయి. అంతరిక్షంలో రాకెట్లు పంపే స్పేస్‌ఎక్స్ అయినా, ఎలక్ట్రిక్ కార్లలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా అయినా... అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో మస్క్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రకటనతో ఆయన టెక్ ప్రపంచంలో కొత్త చర్చకు తెరలేపారు.
* గాల్లో తేలే కారు!
ప్రముఖ జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్, టెస్లా నుంచి 'ఎగిరే కారు' ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను ఈ ఏడాదిలోనే ప్రపంచానికి చూపిస్తామని చెప్పడం విశేషం.
"మా ఆవిష్కరణ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల్లో కనిపించే అన్ని కార్ల ఫీచర్లను కలిపినట్టుగా ఉంటుంది" అని మస్క్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ కారు డిజైన్, నిర్మాణం వివరాలను మాత్రం ఆయన రహస్యంగానే ఉంచారు. అది రెక్కలతో ఉంటుందా? లేక హెలికాప్టర్ తరహాలో గాల్లోకి లేస్తుందా? అన్న ప్రశ్నలకు మస్క్ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం ఆసక్తిని పెంచింది.
*గత వాగ్దానాలు.. ప్రస్తుత ఉత్సాహం
నిజానికి, మస్క్ 2014 నుంచే ఎగిరే కార్ల కాన్సెప్ట్‌పై మాట్లాడుతున్నారు. కానీ, ఇప్పటివరకు అది రూపుదిద్దుకోలేదు. తాజాగా ఆయన మరోసారి ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత ఇవ్వడంతో టెస్లా అభిమానుల్లో, టెక్ వర్గాల్లో భారీ ఉత్సాహం నెలకొంది. టెస్లా రెండో జనరేషన్ రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు విడుదల నేపథ్యంలో ఈ ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
మస్క్ మాటల ప్రకారం చూస్తే, టెస్లా ఫ్లయింగ్ కారు భవిష్యత్ రవాణా విధానంలో మరో విప్లవాత్మక మార్పు తీసుకురావొచ్చు.
* నిరీక్షణకు తెరపడుతుందా?
అయితే, గతంలో మస్క్ ప్రకటించిన హైపర్‌లూప్ , రోబో టాక్సీ వంటి కొన్ని ప్రాజెక్టులు వాయిదా పడిన దృష్ట్యా, ఈ ఎగిరే కారు నిజంగానే ఈ ఏడాదిలో ప్రోటోటైప్‌గా రూపుదిద్దుకుంటుందా? అన్నది ఇప్పుడు టెక్ ప్రపంచం ముందున్న అతి పెద్ద ప్రశ్న.
ఏదేమైనా, ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటన... టెక్నాలజీ భవిష్యత్తుపై కొత్త ఆశలను, అంచనాలను పెంచింది. మస్క్ మాట నిజమై, ఎగిరే కారు వస్తే, అది రవాణా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం!
