Begin typing your search above and press return to search.

వీడియో గేమ్స్ తో తీవ్రవాదుల రిక్రూట్మెంట్... ఎలా చేస్తున్నారంటే..!

ఇక్కడి నుంచే అమాయక పిల్లలను, టీనేజర్లను తమ వైపు లాక్కునేందుకు గేమింగ్ వరల్డ్ ను ఉగ్రవాదులు పావుగా వాడుకుంటున్నారని బ్రిటీష్ పరిశోధకులు చెబుతున్నారు.

By:  Raja Ch   |   2 Aug 2025 5:00 PM IST
Terror Groups Using Online Games to Recruit Youth
X

ఇటీవల కాలంలో బయటకు వెళ్లి ఆడుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. స్కూల్, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఆన్‌ లైన్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆడేందుకే నేటి తరం ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. గంటల తరబడి స్క్రీన్ ముందు అతుక్కుపోతుంది. దీంతో... ఇప్పుడు ఉగ్రవాదుల కన్ను వీటిపై పడిందని.. ఇక్కడి నుంచి యువతను ఆకర్షిస్తున్నారని అంటున్నారు.

అవును... పిల్లోడు ఇంట్లోనే ఉన్నాడు.. బయటకు వెళ్లలేదులే అని అతడిని పట్టించుకోకపోతే ఇక అంతే సంగతులు అని అంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు. ఎందుకంటే.. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఇతరులతో చాట్ చేయడానికి ఉండే అవకాశాన్ని టెర్రరిస్టు బృందాలు ఉపయోగించుకుంటున్నాయని.. దీనిపై నిఘా అతితక్కువగా ఉండటంతో దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారని తెలిపారు.

ఇక్కడి నుంచే అమాయక పిల్లలను, టీనేజర్లను తమ వైపు లాక్కునేందుకు గేమింగ్ వరల్డ్ ను ఉగ్రవాదులు పావుగా వాడుకుంటున్నారని బ్రిటీష్ పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్‌ లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వివిధ రకాల తీవ్రవాద గ్రూపులు, వ్యక్తులు.. వీడియో గేమ్‌ లు ఆడుతూ చాట్ చేయడానికి అనుమతించే ప్లాట్‌ ఫారమ్‌ లను అడ్డాగా మార్చుకుంటున్నాయి.

ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ పోలీసింగ్, ప్రజా రక్షణ పరిశోధన సంస్థలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన డాక్టర్ విలియం ఆల్‌ చార్న్, తన సహోద్యోగి డాక్టర్ ఎలిసా ఒరోఫినోతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా... గేమింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు 'డిజిటల్ ప్లే గ్రౌండ్స్' గా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు.

ఈ క్రమంలో... నయా నాజీల వంటి టెర్రరిస్టు బృందాలు విద్యార్థుల్లో స్త్రీ ద్వేషాన్నీ, యూదు ద్వేషాన్నీ, జాత్యహంకారాన్నీ, కుట్ర సిద్ధాంతాలనూ వ్యాపింపజేస్తున్నాయని.. వాటిపట్ల ఆకర్షితులయ్యే యువతను తమవైపు తిప్పుకుంటున్నాయని వివరించారు. ఎడిన్‌ బర్గ్ స్కూల్లో కాల్పులు జరుపుతానని బెదిరించిన 18 ఏళ్ల ఫెలిక్స్ వింటర్‌ ఉదంతాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.

అతడు నాజీ అనుకూల డిస్కార్డ్ గ్రూపుతో 1,000 గంటలకు పైగా చాట్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. కోర్టు ఆ యువకుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అందువల్ల పిల్లలు ఆడే ఆన్ లైన్ గేమ్స్ పైనా తల్లితండ్రులు ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు.