Begin typing your search above and press return to search.

వివేకా కేసులో మళ్లీ దర్యాప్తు.. నిందితుల వాదన ఇదే..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తు కొనసాగించడంపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

By:  Tupaki Political Desk   |   28 Oct 2025 1:19 PM IST
వివేకా కేసులో మళ్లీ దర్యాప్తు.. నిందితుల వాదన ఇదే..
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తు కొనసాగించడంపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కేసులో కీలక విషయాలు వెల్లడికావాల్సివుందని, దర్యాప్తును సీబీఐ మధ్యలోనే నిలిపేసిందని ఆరోపిస్తూ హతుడి కుమార్తె వైఎస్ సునీత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య కేసు దర్యాప్తును కొనసాగించి మొత్తం కుట్రను బట్టబయలు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు నిందితుల తరుఫున వాదనలను సోమవారం నమోదు చేసింది.

వైఎస్ సునీత పిటిషన్ పై విచారణ జరిగిన సమయంలో తమ తరుఫున వాదనలు వినిపించిన నిందితులు గంగిరెడ్డి, ఉదయకుమార్ రెడ్డి హత్య కేసులో సీబీఐ తరుపరి దర్యాప్తును వ్యతిరేకించారు. అయితే సీబీఐ మాత్రం కోర్టు ఆదేశిస్తే కేసు దర్యాప్తును కొనసాగించేందుకు సముఖత వ్యక్తం చేసింది. దీంతో కోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. సోమవారం సీబీఐ కోర్టులో స్పెషల్ ప్రిన్సిపల్ జడ్జి టి.రఘురాం ఇరుపక్షాల వాదనలను నమోదు చేశారు. సునీత పిటిషన్ పై తేల్చడానికి సుప్రీంకోర్టు గడువు విధించినందున నిర్దేశిత సమయంలోగా నిర్ణయం వెలువరించేందుకు వీలుగా ఈ నెల 27లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు గతంలో నిందితులకు సూచించింది.

అయితే కేసులో నిందితులైన మొత్తం 8 మందికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేస్తే కేవలం ఇద్దరు మాత్రమే తమ వాదనలతో అఫిడవిట్ దాఖలు చేశారు. నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి (అప్రూవర్), శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి మాత్రం పిటిషన్లు దాఖలు చేయలేదు. నిందితులు గంగిరెడ్డి, ఉదయకుమార్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్లలో సునీత పిటిషన్ ను కొట్టివేయాలని అభ్యర్థించారు. మరోవైపు కోర్టు సూచనలతో దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది. అయితే తాము కౌంటర్ దాఖలు చేయబోమని, మెమో వేస్తామని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ అంశంపై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

2019 మార్చిలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో సుమారు ఐదున్నరేళ్లు దర్యాప్తు చేసిన సీబీఐ పలువురిని విచారించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో సహా ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, వైసీపీ కీలక నేత శివశంకర్ రెడ్డితోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసింది. అయితే కేసు దర్యాప్తులో ఇంకా కొన్ని అంశాలు వెలుగు చూడాల్సివుందని, దర్యాప్తు సక్రమంగా పూర్తి చేయకుండానే సీబీఐ ముగించిందని హతుడు వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం ఆదేశాల ప్రకారం సీబీఐ కోర్టులో కేసు దర్యాప్తు కొనసాగింపుపై వాదనలు జరుగుతున్నాయి. సీబీఐ ఈ విషయంలో సానుకూలంగా ఉండటంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ కేసులో హత్య సమాచారం మాజీ సీఎం జగన్ దంపతులకు ఎప్పుడు తెలిసిందనే విషయం కీలకమని భావిస్తున్నారు. హత్య జరిగిన రోజు ఉదయం ఐదు గంటలకే వివేకా మరణించిన విషయం తెలిసిందని మాజీ సీఎస్ అజేయ్ కల్లం వాంగ్మూలమిచ్చారని అంటున్నారు. ఇది కేసు దర్యాప్తులో కీలకంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తు కొనసాగింపునకు కోర్టు ఆదేశిస్తే మాజీ సీఎం దంపతుల వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి.