మంత్రి నాదెండ్ల కోటలో రాజకీయం ఎలా ఉంది..?
తెనాలి నియోజకవర్గంలోని మండలాల పరిధిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజకీయాల్లో జోరు కనిపిస్తోంది.
By: Garuda Media | 25 Sept 2026 3:00 PM ISTతెనాలి నియోజకవర్గంలోని మండలాల పరిధిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజకీయాల్లో జోరు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీలో నాయకుల లేమి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల వ్యవహారం బేజారుగా మారింది. గతంలో కేవలం తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్యే సాగిన ప్రధాన పోటీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ రంగ ప్రవేశంతో త్రిముఖ పోరుగా మారి, చివరకు కూటమి విజయం సాధించింది.
ప్రస్తుతం తెనాలి టౌన్, తెనాలి రూరల్, కొల్లిపర మండలాల పరిధిలో తాజా రాజకీయ సమీకరణాలు మారుతున్నా యి. ఇవి కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కూటమి నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో శ్రేణులు జోరుమీదున్నారు. మనోహర్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నిరంతరం పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో నియోజకవర్గ పరిధిలోని తాగునీటి సమస్యల పరిష్కారానికి, రహదారుల నిర్మాణాలకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ మౌలిక వసతుల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ స్థానిక నేతలు, జనసేన శ్రేణులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే.. కేంద్ర కార్యాలయం చేరువగానే ఉన్నా.. నియోజకవర్గంపై పట్టు సాధించక పోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఇతర ముఖ్య నాయకులు నియోజకవర్గంలో కార్యక్రమాలకు ముక్తసరిగా హాజరవుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలాల వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులు అలర్ట్ అవుతున్నారు. వార్డులు, గ్రామాల పరిధిలో పట్టు నిలుపుకోవడానికి అధికార కూటమి అంతర్గత వ్యూహాలు రచిస్తుండగా, వైసీపీ మాత్రం తిరిగి పుంజుకోవడానికే పరిమితం అవుతోంది. మొత్తంగా చూస్తే, తెనాలి టౌన్, రూరల్ మండలాల పరిధిలో ప్రస్తుతం అధికార పక్షం అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్తుండగా, ప్రతిపక్షం మాత్రం కేడర్‌పై వస్తున్న కేసులను ఎదుర్కొంటూ రాజకీయ ఉనికి కోసం ప్రయాస పడుతోంది.
