అమెరికా యుద్ధ స్మారకాల్లో రీల్స్: తెలుగు ఉద్యోగి తొలగింపు.. తెలుగోళ్లు అంటేనే కంపెనీల సీరియస్
అంతర్జాతీయ టెక్ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్‌వర్క్స్' సంస్థ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.
By: A.N.Kumar | 9 March 2026 4:11 PM ISTఅంతర్జాతీయ టెక్ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్‌వర్క్స్' సంస్థ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు నియామక ప్రక్రియలో ప్రాంతీయ వివక్ష ఆరోపణలు సంస్థపై తీవ్ర విమర్శలకు దారితీయగా మరోవైపు కంపెనీకి చెందిన భారతీయ సంతతి ఉద్యోగి ఒకరు చేసిన అసభ్యకరమైన వీడియో వ్యవహారం సంస్థ ప్రతిష్టను మసకబార్చింది. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియా వేదికగా భారతీయ టెక్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
అభ్యర్థుల ఎంపికలో ప్రాంతీయ వివక్ష?
నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఒక సంఘటన టెక్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో ఇంటర్వ్యూకి హాజరైన ఒక అభ్యర్థి తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంటర్వ్యూ సమయంలో హెచ్‌ఆర్ ప్రతినిధి, అభ్యర్థిని ఆయన ఇండియాలోని స్వరాష్ట్రం గురించి ఆరా తీశారు. అభ్యర్థి తనది తమిళనాడు అని చెప్పిన తర్వాతే ఇంటర్వ్యూ తదుపరి ప్రక్రియ కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా తాము ప్రధానంగా తమిళనాడు లేదా కేరళకు చెందిన అభ్యర్థులకే ప్రాధాన్యతనిస్తున్నామని, గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అభ్యర్థుల వల్ల ఇంటర్వ్యూలలో మోసపూరిత ఘటనలు జరిగాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్‌ఆర్ పేర్కొన్నట్లుగా ఆ అభ్యర్థి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల వ్యక్తుల చేష్టలు బయటపడుతున్నాయి.. కొంతమంది వ్యక్తులు చేసిన తప్పులకు మొత్తం ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఇక్కడ బలికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అభ్యర్థుల ఎంపికలో ప్రాంతీయ వివక్ష చూపడం అత్యంత దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు.
స్మారక స్థలం వద్ద అసభ్య ప్రవర్తన: ఉద్యోగిపై వేటు
ఒకవైపు వివక్ష ఆరోపణలు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మరోవైపు అదే సంస్థలో పనిచేస్తున్న మధు రాజు అనే భారతీయ మూలాలున్న ఉద్యోగి చేసిన పని సంస్థను అప్రతిష్ట పాలు చేసింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన 'వరల్డ్ వార్ II మెమోరియల్' వద్ద ఆయన డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. యుద్ధ వీరుల త్యాగాలకు నిదర్శనంగా నిలిచే పవిత్రమైన ప్రాంతంలో బాధ్యతారహితంగా డ్యాన్స్ చేయడంపై అమెరికన్లతో పాటు భారతీయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీ ప్రతిష్టకు భంగం వాటిల్లింది. దీనిపై వెంటనే స్పందించిన పాలో ఆల్టో నెట్‌వర్క్స్ యాజమాన్యం తమ సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో మధు రాజును తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించింది. కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని సంస్థ వర్గాలు కఠినంగా స్పష్టం చేశాయి.
నిపుణుల హెచ్చరిక.. ఏం జరగాలి?
ఈ రెండు ఘటనల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చేసే చిన్న పొరపాట్లు కూడా వ్యక్తిగత కెరీర్‌నే కాకుండా సంస్థ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో, ఒకరి తప్పును భూతద్దంలో చూపి మొత్తం ప్రాంతానికి చెందిన అభ్యర్థులపై ముద్ర వేయడం నిబంధనలకు విరుద్ధమని ఇది నియామక ప్రక్రియలో పారదర్శకతను దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక బహుళజాతి సంస్థ ఇటువంటి వివాదాల నుంచి పాఠాలు నేర్చుకుని నియామకాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఉద్యోగుల ప్రవర్తన పట్ల మరింత నిఘా ఉంచాలని టెక్ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.
