అప్పుల అప్పారావులు ఆ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువట !
అప్పుడే తెల్లారిందా అని రాజేంద్ర ప్రసాద్ అప్పుల అప్పారావు సినిమాలో ఒక కామెడీ డైలాగ్ వాడతారు. అలాగే చాలా మందికి ఈ డైలాగ్ కంఠోపాఠమే
By: Satya P | 26 Oct 2025 9:04 AM ISTఅప్పుడే తెల్లారిందా అని రాజేంద్ర ప్రసాద్ అప్పుల అప్పారావు సినిమాలో ఒక కామెడీ డైలాగ్ వాడతారు. అలాగే చాలా మందికి ఈ డైలాగ్ కంఠోపాఠమే. ఎందుకని అంటే అప్పు చేయని వాడు వింత పశువు అంటారు. అప్పిచ్చువాడు వైద్యుడు అని సుమతీ శతకం కలిపి చదివేస్తారు. ఆ వెంటనే డాక్టర్ గారి వద్దకే వెళ్ళి అప్పు కొట్టండి సారూ అని అడిగేస్తారు కూడా. ఇవన్నీ ఎందుకు అంటే అప్పుల అప్పారావుల మనస్తత్వం చెప్పడానికే అప్పు చేయడం ఒక కళ ఏమో. అందరికీ అప్పులు పుట్టవు. మరి ఆ కళలో ఆరితేరిన వారు ఎవరూ అంటే దేశం మొత్తం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలే అగ్ర భాగాన ఉన్నాయట. ఇది ఎవరో చెప్పిన కాకి లెక్క కాదు, కేంద్ర గణాంకాల శాఖ రిలీజ్ చేసిన ఒక నివేదిక.
ఏపీ తెలంగాణా పోటీ :
రెండు రాష్ట్రాల్లో పాలకులు ఎటూ ప్రభుత్వాలు నడపడం కోసం అప్పులు చేస్తున్నారు. వాటి విషయం అలా పక్కన ఉంచితే ప్రజలు కూడా ఈ రాష్ట్రాలలో అప్పులు భారీగానే చేస్తున్నారుట. ఈ విషయం ఎవరెంత అంటే ఎవరికి వారుగా పోటాపోటీగా ఉన్నారని ఈ నివేదిక చెప్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే ఏపీలో ఏకంగా 43.7 శాతం మంది తెలంగాణలో 37.2 శాతం మంది అప్పులు చేసి అందులోనే మునిగిపోయారు అని ఈ సర్వే నివేదిక చెబుతోంది. దేశంలో అప్పుల అప్పారావులు చాలా మందే ఉన్నారు. కానీ ఇంతలా పెద్ద శాతంతో ఉన్నవి ఈ రెండు రాష్ట్రాలే అని గణాంకాల శాఖ నివేదిక తేల్చింది.
రాష్ట్రాల వారీగా :
ఇక ప్రజలు పెద్ద ఎత్తున అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాలు చూస్తే కనుక ఏపీ తెలంగాణాల తరువాత కేరళ 29.9 శాతంతో ఉంది. తమిళనాడు 29.4 శాతంతో ఉంటే కర్ణాటక 23.2 శాతంతో ఉంది. ఇవన్నీ దక్షిణాది రాష్ట్రాలే కావడం ఒక విశేషంగా చెబుతున్నారు. అతి తక్కువ రుణ భారంతో సౌఖ్యంగా ఉన్న ప్రజలు చూస్తే దేశంలో ఢిల్లీ ఉంది. ఇక్కడ కేవలం 3.4 శాతంతో ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు ఆ తరువాత చత్తీస్ ఘడ్ 6.5 శాతం, అసోం 7.1 శాతం, ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఒక్క విషయం అర్ధం అవుతోంది దేశంలోని దక్షిణాది రాష్ట్రాలలోనే అప్పుల అప్పారావులు అధికంగా ఉన్నారని, అంతే కాదు ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆర్ధిక పరిస్థితి చాలా బెటర్ అని.
ఆలోచించాల్సిన విషయమే :
అయితే ఇవన్నీ నాలుగేళ్ల క్రితం నాటి లెక్కలు ఈ మధ్యలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చు. ఎంత మార్పు ఉన్నా భారీగా అప్పులు చేసిన ప్రజలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ స్థానాలు అటూ ఇటుగా అలాగే ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వాలు ఎక్కువగా సంక్షేమ పధకాలు దక్షిణాది రాష్ట్రాలలోనే అమలు చేస్తున్నాయి. మరి నగదు బదిలీ పధకాలు అమలు అవుతున్నాయి. వాటిని పుచ్చుకుంటూ కూడా అప్పుల పాలు అవుతున్నారు ప్రజలు అంటే సీరియస్ గానే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.
