Begin typing your search above and press return to search.

'ఐ బొమ్మ' కేసు... దొరికినోడిని దొరికినట్లు వాడేశావా రవి..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ "ఐ బొమ్మ" కేసు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   30 Dec 2025 1:34 PM IST
ఐ బొమ్మ కేసు... దొరికినోడిని దొరికినట్లు వాడేశావా రవి..!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ "ఐ బొమ్మ" కేసు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లు ఈ పైరసీ సినిమా వెబ్ సైట్, దాని నిర్వాహకుడిగా చెబుతోన్న ఇమంది రవి వ్యవహారం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అతని అరెస్టు టాలీవుడ్ కి బిగ్ రిలీఫ్ అనే కామెంట్లు వినిపించాయంటే.. ఇండస్ట్రీపై ఇతని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు!

అవును... ఇంతకాలం ఇండస్ట్రీకి "బొమ్మ" చూపించాడని.. విడుదలైన ప్రతి సినిమా 24 గంటలు గడిచే లోపు హైక్వాలిటీతో ఐబొమ్మ, బెప్పం వెబ్ సైట్స్ లో కనిపించేదని.. దీనివల్ల సినిమాలపై చాలా ప్రభావం పడిందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఐబొమ్మ ప్రభావం వల్ల చాలా మంది ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను తగ్గించుకున్నారనే చర్చా జరిగింది. ఇదే సమయంలో.. దీని ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అతని నకిలీ లీలల వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానో ఏమో కానీ... దాదాపు అన్ని ఐడెంటిటీల విషయంలోనూ ఇమంది రవి నకిలీ సర్టిఫికెట్లే వాడాడని అంటున్నారు. తన అసలు గుర్తింపును దాచిపెట్టి, పూర్తిగా నకిలీ పత్రాలతో వ్యవస్థను తప్పుదోవ పట్టించినట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. తన వద్ద ఉన్న పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతాలు సైతం నకిలీ గుర్తింపులతో తీసుకున్నవే అని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

అన్నింటిలోనూ ‘ఫోటో’ మాత్రం తనది కాగా.. మిగిలిన గుర్తింపులన్నీ ఇతరులవని చెబుతున్నారు. ఈ సందర్భంగా ముగ్గురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించిన సర్టిఫికెట్లను వాడుకుని తన పేరు మీద పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. తన బ్యాంక్ అకౌంట్ అంజయ్య అనే వ్యక్తి పేరుపై ఉందని.. ప్రసాద్ అనే వ్యక్తి సర్టిఫికెట్లనూ వాడేశాడని అంటున్నారు.

కాగా... పోలీసు కస్టడీ అనంతరం జైలుకు తరలించే సమయంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... తన పేరు ఐబొమ్మ రవి కాదని.. ఇమంది రవి అని.. తాను ఎటువంటి పైరసీకి పాల్పడలేదని చెబుతూ.. పోలీసులు చెప్పినంతమాత్రాన్న నిజమైపోతుందా.. తాను విదేశాల్లో ఉన్నట్టు ఎవరు చెప్పారు అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఈ క్రమమంలో.. తాను కూకట్‌ పల్లిలో ఉన్నానని.. కేవలం విదేశీ పౌరసత్వం మాత్రమే తీసుకున్నట్లు తెలిపాడు.