Begin typing your search above and press return to search.

జలపుష్పాల ఆరగింపు తెలుగు రాష్ట్రాల్లో తక్కువే

మాంసాహారంలో ఒకటైన జలపుష్పాల (చేపలు) వినియోగంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడి ఉన్న వైనం తాజాగా విడుదలైన రిపోర్టు పేర్కొంది.

By:  Garuda Media   |   15 Sept 2025 11:00 AM IST
జలపుష్పాల ఆరగింపు తెలుగు రాష్ట్రాల్లో తక్కువే
X

వారంతో సంబంధం లేకుండా నాన్ వెజ్ ను లాగించే విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఘనమైన రికార్డే ఉంది. ఇటీవల కాలంలో మాంసాహారాన్ని భుజించటంలో తెలుగోళ్లు అస్సలు తగ్గట్లేదు. అంతకంతకూ పెరుగుతున్న వినియోగం వేళ.. మాంసాహారంలో ఒకటైన జలపుష్పాల (చేపలు) వినియోగంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడి ఉన్న వైనం తాజాగా విడుదలైన రిపోర్టు పేర్కొంది. దేశ జనాభాలో 72.1 శాతం మంది చేపల్ని ఆహారంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

దేశంలో చేపల సగటు తలసరి వినియోగం 13.1 కేజీలు అయితే.. ఏపీలో ఇది 9.93 కేజీలు ఉంటే.. తెలంగాణలో 8.37 కేజీలు మాత్రమే ఉండటం విశేషం. గత ఏడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చేపల వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది. అయితే.. ఇతర రాష్ట్రాల వినియోగంతో చూస్తే.. ఈ వాడకం తక్కువగా ఉన్నట్లు రిపోర్టు చెబుతోంది. దేశంలోనే అత్యధికంగా 27.62 కేజీల సగటు తలసరి వినియోగంలో త్రిపుర మొదటిస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానంలో కర్ణాటక (20.72 కేజీలు).. కేరళ (20.65 కేజీలు).. మణిపుర్ (18.25 కేజీలు).. ఒడిశా (17.73 కేజీలు) నిలిచాయి.

చేపల వినియోగంలో పశ్చిమ బెంగాల్ చాలా ఎక్కువన్న వాదనలో నిజం లేదన్న విషయాన్ని తాజా రిపోర్టు చెప్పింది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో చేపల సగటు వినియోగం 15.11 కేజీలు మాత్రమే. జాతీయ సగటు వినియోగం కంటే కేవలం 2 కేజీలే ఎక్కువ కావటం.. త్రిపురతో పోలిస్తే దాదాపు 12.5 కేజీల వరకు తక్కువగా ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో మటన్.. చికెన్.. గుడ్లను తినే వారే ఎక్కువని.. చేపల్ని పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువగా తింటారన్న ఆసక్తికర విషయాన్ని రిపోర్టు వెల్లడించింది.

రానున్న రోజుల్లో చేపల వినియోగం అంతకంతకూ పెరిగే వీలుందన్న అంచనాను వ్యక్తం చేసింది. 2030 నాటికి 19.8 కేజీలకు.. 2048 నాటికి 41 కేజీల కంటే సగటు వినియోగం చేరుకుంటుందని వెల్లడించింది. రోజువారీగా చేపలు తినే విషయంలో కేరళ 53.5 శాతంతో ముందు ఉండగా.. గోవా 36.2 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే విందు వినోదాల్లోనూ చేపల వంటల్ని సర్వ్ చేయటం తక్కువేనని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చేపలు పెద్దగా దొరక్కపోవటం.. చేపల్ని క్లీన్ చేసే విషయంలో ఉన్న చిక్కుల కారణంగా విందుల్లో వీటి వినియోగం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. చేపల వినియోగంలో తెలుగు వారు వారానికి ఒకసారి తినే వారే అధికమని తేలింది. రోజువారు తినే వారు చాలా చాలా తక్కువగా పేర్కొన్నారు.