Begin typing your search above and press return to search.

ప్రముఖ సీనియర్ నటి ఆమని సంచలన నిర్ణయం

ప్రముఖ ఒకప్పటి సీనియర్ నటి ఆమని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

By:  A.N.Kumar   |   20 Dec 2025 3:40 PM IST
ప్రముఖ సీనియర్ నటి ఆమని సంచలన నిర్ణయం
X

ప్రముఖ ఒకప్పటి సీనియర్ నటి ఆమని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని.. తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే రీఎంట్రీతో పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 5 చిన్న సినిమాల్లో ఆమె నటించారు.

తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినీ రంగం నుంచి చాలా మంది తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడం సహజమే.. కానీ ఆమని బీజేపీలో చేరడం ప్రాధాన్యత ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలు సామాజిక అంశాల గురించి ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె వాయిస్ బీజేపీకి ఉపయోగపడుతుంది పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఆమని తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్ సినిమాల్లో నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయికిగా సినీ రంగప్రవేశం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్స్ వరించాయి. బాపు దర్శకత్వం వహించిన ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో నటించిన ఆమనికి ఉత్తమనటిగా నంది బహుమతిని అందుకున్నారు. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డ్ కూడా దక్కించుకుంది.

తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియొద్దీన్ ను పెళ్లి చేసుకొని సినిమా రంగానికి దూరమైన ఆమని తిరిగి 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం ‘మధ్యాహ్నం హత్య’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతం కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని ఓ ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. నిజనిజాలు తెలియాల్సి ఉంది.