Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా సెన్షేషన్ అగ్గిపెట్టె మచ్చ మృతి

సోషల్‌ మీడియాలో ఓవర్‌ నైట్‌ స్టార్స్‌, సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.

By:  Ramesh Palla   |   7 Oct 2026 6:14 PM IST
సోషల్ మీడియా సెన్షేషన్ అగ్గిపెట్టె మచ్చ మృతి
X

సోషల్‌ మీడియాలో ఓవర్‌ నైట్‌ స్టార్స్‌, సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కిరణ్‌ కుమార్‌ ఒకరు. తెలుగు నెటిజన్స్‌ కి కిరణ్‌ కుమార్‌ అంటే ఠక్కున తెలియక పోవచ్చు, కానీ అగ్గిపెట్టె మచ్చ అంటే వెంటనే గుర్తు పడుతారు. సోషల్‌ మీడియాలో అగ్గిపెట్టె మచ్చగా పేరు సొంతం చేసుకున్న కిరణ్‌ కుమార్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. తిరుపతికి చెందిన మచ్చ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో స్థానిక స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మచ్చ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులు సైతం మచ్చ మృతిని దృవీకరించడంతో అతడి సన్నిహితులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అగ్గిపెట్టె మచ్చ మృతి...

తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ గురించి చాలా సినిమాల్లోనూ మనం చూడటం జరిగింది. ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ, మరికొన్ని ఛానల్స్‌లో ప్రసారం అయిన కామెడీ షో ల్లోనూ అగ్గిపెట్టె మచ్చ సందడి చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. అతడి జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తిరుపతికి చెందిన కిరణ్‌ కుమార్‌ ఒక ఇంటర్వ్యూ కారణంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. ఆ వీడియోతో కిరణ్ కుమార్‌ కాస్త అగ్గిపెట్టె మచ్చ అయ్యాడు. సోషల్‌ మీడియాలో అగ్గిపెట్టె మచ్చగా మంచి పేరు రావడంతో పాటు, సెలబ్రిటీ రేంజ్‌ లో ఫాలోయింగ్‌ దక్కడంతో మరిన్ని వీడియోలు చేయడం జరిగింది. సోషల్‌ మీడియాలో మచ్చ ఎక్కువగా మీమ్స్ పేజీల్లో కనిపిస్తూ ఉంటాడు.

స్టేజ్‌ షోలతో సందడి....

ఎప్పుడు చూసినా ఫుల్‌గా తాగి ఉన్నాడు అనిపించే విధంగా మచ్చ కనిపిస్తాడు. స్టేజ్ షో ల మీద కనిపించినా, మరెక్కడ కనిపించినా కిరణ్‌ కుమార్‌ అలియాస్‌ అగ్గిపెట్టె మచ్చ తాగి ఉంటాడు అనే టాక్‌ ఉంది. రాయలేని బూతులు మాట్లాడుతూ అదే తన స్టైల్‌ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే అగ్గిపెట్టె మచ్చ మృతి వార్తను ఆయన సన్నిహితులు, సోషల్‌ మీడియా ఫాలోవర్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. నెట్టింట మచ్చకు దక్కిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతడి డైలాగ్‌ లు ఎక్కువగా మీమ్‌ పేజీల్లో, ట్రోల్స్ పేజీల్లో కనిపించడం మనం చూస్తూనే ఉంటాం.

సినిమాలు, సిరీస్‌లతో...

అగ్గిపెట్టె మచ్చ ఎక్స్ ప్రెషన్స్ ను చాలా మంది కాపీ చేయడం, ఏకంగా సినిమాల్లోనూ అతడి ఇన్‌పుట్స్ ను తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. టీవీ షో లు మొదలుకుని వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో వరకు మచ్చ డైలాగ్స్‌, మీమ్స్‌ ను వాడటం మనం చూశాం. ఇప్పుడు అతడు లేడు అనే వార్త కచ్చితంగా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంకు లోటు అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో మంది ఓవర్ నైట్‌ స్టార్స్ అయ్యారు. అయితే అందరూ ఒక ఎత్తు అయితే మచ్చది ఒక ఎత్తు అనడంలో సందేహం లేదు. అందుకే అతడు మృతి చెందడం అందరినీ కలిచి వేస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా వినోదాన్ని అందించిన మచ్చ లేని లోటు పూడ్చలేనిది అంటూ తెలుగు నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.