అమెరికాలో చదువుకోవాలనే కల.. గోల్డ్ స్కామ్‌లో తెలుగు విద్యార్థికి 30 నెలల జైలు శిక్ష
అమెరికాలో విద్యాభ్యాసం కోసం విద్యార్థి వీసాపై అడుగుపెట్టిన చాగంరెడ్డి.. చివరకు ఫెడరల్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు.
By: A.N.Kumar | 12 Sept 2026 3:29 PM ISTఅమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ తెలుగు మూలాలున్న యువకుడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటూ ఓ పెద్ద మోసగాళ్ల ముఠాలో భాగస్వామిగా మారిన వెంకటేశ్వర చాగంరెడ్డికి అమెరికా ఫెడరల్ కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. మోసానికి గురైన బాధితుడికి 99,496 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. జైలు శిక్ష పూర్తైన తర్వాత మూడేళ్ల పాటు అతడు అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
ఒక్క ఫోన్ కాల్‌తో మొదలైన మోసం
ఈ ఘటన 2025 ఆగస్టులో జరిగింది. 79 ఏళ్ల వియత్నాం యుద్ధ మాజీ సైనికుడు తన కంప్యూటర్‌లో సమస్య రావడంతో మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నంబర్ కోసం వెతికాడు. అయితే అతడికి అసలు మైక్రోసాఫ్ట్ నంబర్ బదులుగా మోసగాళ్ల ఫోన్ నంబర్ దొరికింది. అవతలి వ్యక్తులు తాము మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సిబ్బందినంటూ అతడిని నమ్మించారు. కంప్యూటర్ అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోందని భయపెట్టారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ఫెడరల్ అధికారి అని చెప్పాడు.
డబ్బు కాపాడుకోవాలంటే బంగారం కొనండి
బాధితుడిని మరింత భయపెట్టిన మోసగాళ్లు.. అతడి డబ్బు ప్రమాదంలో ఉందని దాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే నగదును బంగారు బార్లుగా మార్చాలని సూచించారు. అధికారుల సూచనల మేరకే ఈ పని చేస్తున్నట్లు నమ్మించారు. ఇలా వృద్ధుడి వద్ద నుంచి బంగారాన్ని తీసుకునేందుకు ముఠా సభ్యులు రంగంలోకి దిగారు. ఈ మొత్తం వ్యవహారంలో వెంకటేశ్వర చాగంరెడ్డి కొరియర్‌గా పనిచేశాడు. వివిధ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ వృద్ధుల నుంచి నగదు, బంగారు బార్లను సేకరించి ముఠా సభ్యులకు అందించేవాడని దర్యాప్తులో తేలింది.
వృద్ధుడి కుటుంబ సభ్యుడి అప్రమత్తతతో బట్టబయలు
మోసగాళ్లు వృద్ధుడిని మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అతడు ఈ విషయం కుటుంబ సభ్యుడికి చెప్పాడు. వెంటనే వారు ఇది మోసమని గుర్తించారు. అదే సమయంలో చాగంరెడ్డి మరోసారి బాధితుడి ఇంటికి బంగారం లేదా నగదు తీసుకునేందుకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు.
విద్యార్థి వీసా నుంచి ఫెడరల్ జైలు వరకు..
అమెరికాలో విద్యాభ్యాసం కోసం విద్యార్థి వీసాపై అడుగుపెట్టిన చాగంరెడ్డి.. చివరకు ఫెడరల్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉండగా తదుపరి అమెరికా బ్యూరో ఆఫ్ ప్రిజన్స్‌కు బదిలీ చేయనున్నారు. జైలు శిక్ష పూర్తయిన అనంతరం అతడి ఇమ్మిగ్రేషన్ పరిస్థితి ఆధారంగా భారత్‌కు డిపోర్ట్ చేసే అవకాశం ఉంది.
డబ్బు కోసం దారి తప్పితే.. భవిష్యత్తే ప్రశ్నార్థకం
అమెరికాలో చదువు, ఉద్యోగం, మెరుగైన భవిష్యత్తు కోసం వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా ఉంది. అయితే అక్కడి చట్టాలను ఉల్లంఘించి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే.. కేసు తీవ్రతను బట్టి కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చాగంరెడ్డి కేసు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఒకప్పుడు విద్యార్థి వీసాతో అమెరికాలో భవిష్యత్తును నిర్మించుకోవాలని వెళ్లిన వ్యక్తి.. ఇప్పుడు ఫెడరల్ జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకునే సైబర్, గోల్డ్ స్కామ్‌లలో భాగస్వామ్యం కావడం ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
