తెలుగోడు..రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మనోడు అనేటోడు ప్రపంచంలో ఎక్కడున్నా... అత్యుత్తమ స్థాయికి వెళ్లినప్పుడు అభినందించాల్సిందే.
By: Garuda Media | 16 Nov 2025 9:38 AM ISTమనోడు అనేటోడు ప్రపంచంలో ఎక్కడున్నా... అత్యుత్తమ స్థాయికి వెళ్లినప్పుడు అభినందించాల్సిందే. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని వారికి వారి సొంత రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడున్నా.. ఏ స్థాయికి వెళ్లినా.. బయటకు కనిపించని ప్రోత్సాహాన్ని ఎవరికి వారు అందిస్తూ ఉంటారు. మరింత వివరంగా చెప్పాలంటే.. దక్షిణాదిన ఉన్న రాష్ట్రాల్నే తీసుకుంటే తమిళులు.. మలయాళీలు ఎక్కడున్నా.. ఏ స్థానాల్లో ఉన్నా.. తమ వద్ద పని చేసే తమ రాష్ట్రానికి చెందిన వార పట్ల ప్రదర్శించే ప్రేమాభిమానాలు భారీగా ఉంటాయి.
అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారినే తీసుకుంటే.. ఇలాంటి ఫీలింగ్ చాలా తక్కువగా చెబుతారు. ఇలా ఉండటం సరైనదా? కాదా? అనే దానికి ఎవరి సిద్ధాంతాలు వారు చెబుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమ ప్రాంతానికి చెందిన వారు అత్యుత్తమ పని తీరు ఉంటే ప్రోత్సహించటం తప్పేం కాదు. అదేమీ నేరం కూడా కాదు. బ్యాడ్ లక్ ఏమంటే.. తెలుగోళ్లు ఎక్కడున్నా.. తమ వాళ్లను ప్రోత్సహించటాన్ని తప్పుడు చర్యగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే సమయంలో తమపైన ఉన్నోళ్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అయి ఉండి.. వారు తమ రాష్ట్రానికి చెందిన వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తే మాత్రం.. ఆసూయతో రగిలిపోతుంటారు.
ఇదంతా ఎందుకంటే.. జరిగిందేదో జరిగింది. తెలుగోళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా.. వారి పని తీరు బాగున్నప్పుడు దగ్గరకు తీసుకోవటం.. వారిని కాస్త స్పెషల్ గా ట్రీట్ చేయటం తప్పేం కాదు. ప్రపంచంలోని చాలా జాతులు చేసే పని ఇదే. ఇప్పుడు విషయానికి వస్తే.. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ప్రాంతానికి చెందిన ఒకరు తాజాగా ఎంపికయ్యారు.
1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వంలో పలు కీలక స్థానాల్లో సేవలు అందించిన ఆయన్ను.. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఢిల్లీ నుంచి సొంత రాష్ట్ర క్యాడర్ కు పంపించారు. అలా పంపిన తర్వాతి రోజే.. ఆయన్ను రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేయటం విశేషం. సోమవారం (నవంబరు 17) ఆయన బాధ్యతల్ని చేపట్టనున్నారు.
శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన తండ్రి అరకలోయలో జాతీయ మలేరియా నిర్మూలన ప్రోగ్రాంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ గా పని చేస్తున్న సమయంలో అక్కడే జన్మించారు. 1966 సెప్టెంబరు ఒకటిన జన్మించిన శ్రీనివాస్ పన్నెండేళ్ల పాటు అరకులోయ.. తెలంగాణలోని దుమ్ముగూడెంలో పెరిగారు. భద్రాచలం పంచాయితీ స్కూల్ విద్యను అభ్యసించారు. ఓయూలో 1987లో కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన ఆయన.. 1989లో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్ ను క్రాక్ చేసి.. ఐఏఎస్ గా ఎంపికయ్యారు.
వివిధ స్థానాల్లో పని చేసిన శ్రీనివాస్ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మనమరాలిని వివాహమాడారు. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన ఆయన.. ఇటీవల ఒక పుస్తకాన్ని (టువర్డ్స్ ఏ న్యూ ఇండియా) రాశారు. అందులో తాను అరకులోయలో ఉన్నప్పుడు గిరిజనులతో తనకున్న తీపి గురుతుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల విశాఖలో జరిగిన 28వ నేషనల్ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఓరుగంటి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తొంభై దశకం నుంచే స్మార్ట్ గవర్నెన్స్ కు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా ప్రభుత్వ సంస్థల పని తీరు మారిందని.. దీని కారణంగా కోట్లాది మందికి ప్రయోజనం లభించినట్లుగా పేర్కొన్నారు. తాను అండర్ సెక్రటరీగా చేరిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని.. తాను ఇప్పుడు 37ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సమయంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు దేశానికి చేసిన సేవలకు మేం చేస్తున్న సెల్యూట్ ను స్వీకరించండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయనిప్పుడు రాజస్తాన్ కు సీఎస్ గా నియమితులు అయ్యారు. ఏమైనా.. తోటి తెలుగోడు సాధించిన ఈ విజయాన్ని తెలుగోళ్లంతా సంతోషంగా ఫీల్ అవ్వాల్సిన అవసరముందని చెప్పక తప్పదు.
