మొబైల్ యూజర్లకు షాక్.. మరోసారి పెరగనున్న టెలికం టారిఫ్‌లు
దేశంలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన వ్యయాలు, ఇతర సేవల ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు.
By: A.N.Kumar | 6 July 2026 4:51 PM ISTదేశంలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన వ్యయాలు, ఇతర సేవల ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో మొబైల్ వినియోగదారులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ తన తాజా నివేదికలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలు రానున్న 3 నుంచి 4 నెలల్లో తమ మొబైల్ టారిఫ్ ప్లాన్‌ల ధరలను 12 శాతం నుండి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.
ధరల పెంపునకు గల ప్రధాన కారణాలు
దేశవ్యాప్తంగా 4G, 5G సేవలు వేగంగా విస్తరిస్తుండటంతో మొబైల్ డేటా వినియోగం మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగింది. వినియోగదారులు హైస్పీడ్ ఇంటర్నెట్, వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత సేవలను విస్తృతంగా వాడుతున్నారు. దీనివల్ల టెలికం కంపెనీలపై నెట్‌వర్క్ విస్తరణ, కొత్త టెక్నాలజీ మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అదనపు వ్యయాలను అధిగమించి, తమ ఆదాయాన్ని స్థిరపరచుకోవడానికి కంపెనీలు టారిఫ్‌ల పెంపును ఏకైక మార్గంగా ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వినియోగదారులపై పడే ప్రభావం
ప్రస్తుతం దేశంలోని ప్రధాన టెలికం సంస్థలు ఇప్పటికే గత ఏడాది కొన్ని ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి ధరలు పెరిగితే, అది సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. రెండు విభాగాల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. హెవీ డేటా వినియోగదారులు.. రోజువారీ ఎక్కువ డేటా ఉపయోగించే వారు.. మల్టీ-మీడియా కంటెంట్ చూసేవారు నెలవారీగా మరింత ఎక్కువ మొత్తాన్ని రీఛార్జ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది.
పెరగనున్న ఏఆర్.పీయూ
టారిఫ్‌ల పెంపు ద్వారా టెలికం రంగంలో అత్యంత కీలకంగా పరిగణించే ఏఆర్.పీయూ (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) గణనీయంగా మెరుగుపడుతుందని సెంట్రమ్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోనే టెలికం కంపెనీల ఏఆర్.పీయూ 1% నుండి 1.5% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకవేళ రాబోయే 3-4 నెలల్లో టారిఫ్‌ల పెంపు గనుక అమల్లోకి వస్తే రాబోయే త్రైమాసికాల్లో ఈ సగటు ఆదాయం మరింత ఊపందుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు ఇప్పటివరకు అధికారికంగా టారిఫ్‌ల పెంపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అయినప్పటికీ మార్కెట్ విశ్లేషణలు, పెరుగుతున్న నెట్‌వర్క్ వ్యయాలు, 5జీ విస్తరణ కోసం చేస్తున్న భారీ పెట్టుబడుల దృష్ట్యా ధరల పెంపు దాదాపు ఖాయమనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే.. రానున్న రోజుల్లో మొబైల్ బిల్లులు మరింత ప్రియం కావడం వల్ల దేశంలోని కోట్లాది మంది మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. టెలికం ప్రియులు ఈలోపే తమకు నచ్చిన లాంగ్-టెర్మ్ ప్లాన్లను పరిశీలించుకోవడం మంచిది.
