దుబాయ్ జైలులో తెలంగాణ వ్యక్తి.. శిక్ష పూర్తయినా ఇంటికి రాలేని దుస్థితి
ఇక్కడ స్వదేశంలో ఉన్న మల్లేశం కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం. పూట గడవడమే గగనంగా ఉన్న ఆ పేద కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం కంటిముందు కొండంత నిరాశను మిగిల్చింది.
By: A.N.Kumar | 6 Oct 2026 3:22 PM ISTకంటిపాపలా చూసుకోవాల్సిన కుటుంబాన్ని బతికించుకునేందుకు.. కన్నతల్లిలాంటి ఊరిని వదిలి ఎడారి దేశం బాటపట్టాడు. రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసి.. సొంతింటి కష్టాలను గట్టెక్కిద్దామనుకున్నాడు. కానీ దురదృష్టం అడుగడుగునా వేటాడింది. ఆరు నెలల జైలు శిక్ష ముగిసినా.. కటిక పేదరికం విధించిన రూ.39 లక్షల జరిమానా రూపంలో అతడి కాళ్లకు సంకెళ్లు వేసింది..
తెలంగాణ నేల ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పంపిన వేలాది మంది కార్మికుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన ఏగుర్ల మల్లేశం ఒకడు. ఎదిగిన పిల్లల భవిష్యత్తు..కళ్లముందే కనిపిస్తున్న పేదరికం అతడిని ప్రవాస బాట పట్టించాయి. 2018లో ఒమన్‌లోని మస్కట్‌కు చేరుకున్న మల్లేశం.. కుటుంబానికి కాస్తో కూస్తో ఆసరాగా నిలిచాడు. అయితే జీవనపోరాటంలో తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం అతడి జీవితాన్ని చీకటిమయం చేసింది.
ఎనిమిదేళ్ల రహస్య పోరాటం.. తనిఖీల్లో వెలుగులోకి
సరైన వీసా, పాస్‌పోర్టు అనుమతులు లేకపోవడంతో అక్రమ మార్గంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోకి ప్రవేశించిన మల్లేశం.. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఎవరికీ కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాడు. రెక్కల కష్టం నుంచి వచ్చిన ప్రతి పైసానూ స్వదేశంలో ఉన్న కుటుంబానికే పంపాడు. కానీ ఈ ఏడాది మార్చిలో దుబాయ్ అధికారులు నిర్వహించిన అకస్మాత్తు తనిఖీల్లో అతడు పట్టుబడ్డాడు. అక్కడి క్రిమినల్ కోర్టు అతడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు 1.5 లక్షల దిర్హామ్‌లు.. భారత కరెన్సీలో సుమారు రూ. 39 లక్షలు భారీ జరిమానా విధించింది.
శిక్ష తీరింది.. కానీ ‘పేదరికం’ వదలడం లేదు
కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్ష ముగిసింది. తోటి ఖైదీలు విడుదలవుతుంటే.. మల్లేశం మాత్రం జైలు గోడల మధ్యే ఉండిపోయాడు. కారణం.. రూ.39 లక్షల జరిమానా.. ఆ భారీ మొత్తాన్ని చెల్లిస్తేనే డిపోర్టేషన్ స్వదేశానికి పంపే ప్రక్రియ సాధ్యమవుతుందని దుబాయ్ అధికారులు స్పష్టం చేశారు.
ఇక్కడ స్వదేశంలో ఉన్న మల్లేశం కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం. పూట గడవడమే గగనంగా ఉన్న ఆ పేద కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం కంటిముందు కొండంత నిరాశను మిగిల్చింది. "శిక్ష పూర్తయినా నా కొడుకు ఇంటికి రాలేకపోతున్నాడు.. ఏ పాపం తెలియని మా మల్లేశాన్ని మాకు అప్పగించండి" అంటూ కంటి నుంచి జారే కనీళ్లతో ఆ తల్లిదండ్రులు దండం పెడుతున్నారు.
ప్రభుత్వ జోక్యమే ఆఖరి ఆశ
ఈ విషాద గాథ స్థానిక నాయకుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. మల్లేశంను సురక్షితంగా మాతృభూమికి రప్పించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చారు. స్పందించిన ప్రభుత్వం, దౌత్య మార్గాల ద్వారా యూఏఈ అధికారులతో సంప్రదింపులు జరిపి జరిమానా మినహాయింపు లేదా ఇతర న్యాయపరమైన పరిష్కారాల ద్వారా అతడిని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
విదేశంలో చిక్కుకున్న ఒక పేద తెలంగాణ బిడ్డను.. కంటిపాపలా ఎదురుచూస్తున్న ఆ కుటుంబాన్ని కలిపేందుకు ప్రభుత్వం చేసే ఈ దౌత్య ప్రయత్నాలు సఫలమవ్వాలని.. మల్లేశం త్వరలోనే స్వదేశానికి చేరుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తున్నారు.
