మామూలోడు కాదు సీఎం రేవంత్.. మహిళల మనసు దోచే భారీ ప్లాన్
మహిళామణుల చేతులతో నడిచే మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసేలా.. వాటిని టీజీ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేసి..
By: Garuda Media | 19 Nov 2025 1:48 PM ISTఅందుకే అంటారు ఎవరిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ఎన్నికల బరిలోకి దిగి.. ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి.. ఆ పదవిలో సెటిల్ కావటానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా.. కుదురుకుంటున్న కొద్దీ తన తెలివి ఎంతన్న విషయాన్ని తెలియజేసే నిర్ణయాల్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయేది ఆ కోవకు చెందిందే.
ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళామణులకు ఉచిత బస్సు ప్రయాణ బహుమతిని అందజేసిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు అదే పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మాస్టర్ ప్లాన్ వేశారు. ఫ్రీ బస్సు పథకంతో మహిళల ప్రయాణాలు పెరగటం.. అందుకు తగ్గట్లు బస్సుల అందుబాటు లేకపోవటం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా ఇప్పుడు ఆయన మరో ఎత్తుగడకు తెర తీశారు.
మహిళా మణుల చేతులతో నడిచే మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసేలా.. వాటిని టీజీ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేసి.. ప్రతి నెలా ఈఎంఐను కట్టేలా.. అదనపు ఆదాయం పొందేలా చేసే పథకానికి తెర తీశారు. దీంతో మహిళలు ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందన్నది సీఎం రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. మహిళా సమాఖ్యల ఆదాయం పెంపుకోసం ఎస్ఈఆర్ పి ద్వారా దేశంలోనే తొలిసారి600 బస్సులు కొనుగోలు చేసేలా ప్లాన్ చేశారు.
వాటిని టీజీ ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. మహిళా సంగాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని అందించనుంది. ఇందులో భాగంగా టీజీఆర్టీసీకి.. సెర్ప్ కు మధ్య డీల్ కుదిరింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రజారవాణాలో స్వయం సహాయక సంఘాలు కీలక భూమిక పోషించేలా ముఖ్యమంత్రి రేవంత్ ప్లాన్ చేశారని చెప్పాలి. ఇందులో భాగంగా సెర్ప్ గుర్తించిన 17 జిల్లాల్లోని 151 మండల మహిళా సమాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున 151 బస్సుల్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తారు. రెండో దశలో 449 బస్సుల్నికొనుగోలు చేసేలా ప్లాన్ చేశారు.
ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు ఖర్చు కాగా.. అందులో రూ.6 లక్షలు మండల మహిళా సమాఖ్య తన సొంత నిధుల్ని ఖర్చు చేస్తుంది. మిగిలిన రూ.30 లక్షలను కమ్యూనిటీ ఫండ్ గా అందించేలా ప్లాన్ చేశారు. ప్రతి బస్సునకు టీజీఆర్టీసీ ప్రతి నెలా రూ.69,648 అద్దె చెల్లిస్తుంది. ఇందులో రూ.19,648 మొత్తాన్ని నిర్వాహణ ఖర్చు కింద మహిళా సమాఖ్యలు తమ వద్ద ఉంచుకొని.. మిగిలిన రూ.50 వేలను ఈఎంఐ కింద బ్యాంకు రుణాన్ని వాయిదాల పద్దతిలో తీరుస్తాయి.
అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం కారణంగా మహిళా సంఘాలు లాభ పడుతున్నాయి. గతంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సుల్ని లీజుకు తీసుకునే టీజీఆర్టీసీ ఇప్పుడు మహిళా సమాఖ్యల నుంచి తీసుకుంటున్న కారణంగా..ఆయా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. రానున్న రోజుల్లో కొత్త బస్సులు పెరిగే కొద్దీ.. ఇందులో పాలు పంచుకునే మహిళా సంఘాల సంఖ్య పెరుగుతోంది. మహిళామణుల మనసుల్ని దోచే ఈ ప్లాన్ చూస్తే.. సీఎం రేవంత్ విజన్ ఎంత భారీగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
