Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాదిరి మేం చీడ ప‌నులు చేయం: మంత్రి ఉత్త‌మ్‌

తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి.. మాజీ సీఎం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

By:  Garuda Media   |   24 Sept 2025 9:41 AM IST
కేసీఆర్ మాదిరి మేం చీడ ప‌నులు చేయం: మంత్రి ఉత్త‌మ్‌
X

తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి.. మాజీ సీఎం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న హ‌యాంలో తెలంగాణ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని.. పొరుగు రాష్ట్ర ముఖ్య‌మం త్రి(జ‌గ‌న్‌-కానీ పేరు చెప్ప‌లేదు)తో చేతులు క‌లిపి.. నీటిని ధార‌ద‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. అదేవిధంగా తెలంగాణ‌ను అన్ని విధాలా నాశ‌నం చేశార‌ని.. చీడ ప‌నులు చేసి.. రాష్ట్రాన్నికొల్ల‌గొట్టార‌ని అన్నారు. కానీ, త‌మ ప్ర‌భుత్వం అలాంటి చీడ‌ప‌నులు చేయ‌బోద‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా మంగ‌ళ‌వారం ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. కృష్ణాన‌ది జలాల వివాదంపై స్పందిం చారు. చుక్క‌నీటిని కూడా తాము వ‌దులుకునేది లేద‌న్నారు. ``ఏపీ అవ‌స‌రాల‌ని చెబుతున్నారు. ఈ అవ‌స‌రాలు మాకు లేవా? మాద‌గ్గ‌ర రైతులు లేరా? మా ద‌గ్గ‌ర పంట‌లు పండాల్నా వ‌ద్దా?`` అని ప్ర‌శ్నించా రు. అంతేకాదు.. లేనిపోని విజ‌న్‌లు మాకు అవ‌స‌రం లేదంటూ.. ఏపీ ప్ర‌భుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరోక్షంగా ఆయ‌న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై విమ‌ర్శ‌లు చేశారు.

అందురూ తెలుగు వారే. కానీ, మాకు అవ‌స‌రం ఉండ‌దా? అని ప్ర‌శ్నించారు. తెలుగు వారేన‌ని.. మా నీళ్లు వాడుకుంటామంటే ఎందుకు ఊరుకుంటామ‌ని ప్ర‌శ్నించారు.''న్యాయంగా, ధ‌ర్మంగా.. మాకు రావాల్సిన నీటిని మేం వాడుకుంటాం. ఈ విష‌యంపై బ‌లంగా వాద‌న‌లు వినిపిస్తాం. అంతేకానీ.. కేసీఆర్ మాదిరి లాలూచీ ప‌డి.. చీక‌టి ఒప్పందాలు చేసుకుని తెలంగాణ స‌మాజాన్ని ఏమార్చేది లేదు.`` అని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో రాష్ట్రం తరఫున సమర్థమైన వాదనలు వినిపిస్తామన్నారు.

ఇదిలావుంటే, మంగ‌ళ‌వారం నుంచి 3 రోజులపాటు కృష్ణా ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గానే లెక్కించి కృష్ణాజ‌లాల‌ను పంపిణీ చేశారు. దీంతో త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, రాష్ట్రం ఏర్ప‌డ్డాక త‌మ ఆయ‌క‌ట్టు పెరిగింద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ నేప‌థ్యంలోకృష్ణా జలాల‌ను తిరిగి లెక్కించి.. న్యాయ‌మైన వాటాను త‌మ‌కు కేటాయించాల‌ని కోరుతోంది. ఈ నేప‌థ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జ‌రిగే వాద‌న‌ల‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది.