ఏపీ ఏసీబీకి తెలంగాణ బెంచ్‌మార్క్ సెట్ చేస్తోందా...?
తెలంగాణ ఏసీబీ ప్రస్తుతం పూర్తి దూకుడు మీద ఉంది. పక్కా ముందస్తు సమాచారంతో, బలమైన ఆధారాలతో విరుచుకుపడుతోంది.
By: Garuda Media | 8 Aug 2026 7:00 PM ISTతెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఏసీబీ అనుసరిస్తున్న తీరు వేర్వేరుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణ ఏసీబీ ప్రస్తుతం పూర్తి దూకుడు మీద ఉంది. పక్కా ముందస్తు సమాచారంతో, బలమైన ఆధారాలతో విరుచుకుపడుతోంది. వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహిస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఎంతటి వారైనా, ఆఖరికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులైనా సరే వదిలేది లేదనే స్పష్టమైన సంకేతాలను పంపుతోంది.
తెలంగాణలో ఇలా ఉంటే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీ ఏసీబీ కేవలం లంచాలు తీసుకునే కింది స్థాయి ఉద్యోగులు, విఆర్‌వోలు, సచివాలయ సిబ్బంది వంటి 'చిన్న చేపలనే' టార్గెట్ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతిపై కఠినంగా ఉంటారని, వ్యవస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పెద్ద ఎత్తున దాడులు చేయిస్తారనే టాక్ ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇంకా ఆ స్థాయి భారీ ఆపరేషన్లు మొదలుకాకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు ఏపీలో కూటమి పాలనలో గతం కంటే అవినీతి హెచ్చుమీరుతోందన్న చర్చలు ప్రజల్లోనే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
అయితే మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం మారిన కొత్తలో ఏసీబీ ముందుగా వ్యవస్థలను సమీక్షించుకోవడం, ఆధారాలు సేకరించడంపై దృష్టి పెడుతుంది. పెద్ద పెద్ద చేపటనలు టార్గెట్ చేయాలంటే కోర్టుల్లో నిలబడే బలమైన చట్టబద్ధమైన సాక్ష్యాలు చాలా అవసరం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం ఏసీబీ అంతర్గతంగా లోతైన పరిశోధన చేస్తోందని, త్వరలోనే ఏపీలోనూ పెద్ద స్థాయి సోదాలు షురూ అవుతాయని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవంగా చూస్తే కింది స్థాయిలో చిన్నచితకా కేడర్‌లో ఉన్న సిబ్బందిపై ఎన్ని దాడులు చేసినా.. ఎంతమందిని పట్టుకున్నా వ్యవస్థలో పెద్దగా మార్పు రాదు. వేల కోట్ల ప్రజాధనాన్ని పక్కదోవ పట్టించిన అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తేనే పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. తెలంగాణ ఏసీబీ చూపిస్తున్న దూకుడు ఇప్పుడు ఏపీకి ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నా, పాలనలో పారదర్శకత రావాలన్నా ఏపీ ఏసీబీ కూడా రూట్ మార్చి, పెద్ద తిమింగలాల బండారాన్ని బయటపెట్టే భారీ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
