తెలంగాణలోనే నెక్ట్స్ 'సర్'!!
తాము చేపట్టిన సర్ ప్రక్రియ నిష్పక్ష పాతంగా..పారదర్శకంగా ముందుకు సాగుతోందని చెప్పారు. అంతేకాదు.. ప్రపంచానికి మార్గదర్శిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అవతరించిందన్నారు.
By: Garuda Media | 23 Dec 2025 8:00 AM ISTదేశవ్యాప్తంగా వివాదం అయినప్పటికీ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని వివాదాలు.. అంతకుమించిన విమర్శలు వస్తున్నా.. దీనిని ముందుకు తీసుకువెళ్తోంది. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన సర్ ప్రక్రియలో ఏకంగా 97 లక్షలమంది ఓటర్లను తొలగించారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ప్రక్రియలో ఏకంగా 25లక్షల మందినితొలగించగా.. మరో 25 లక్షల మంది జాబితాలో లేకుండా పోయారు. ఇంకో 24 లక్షల మంది పేర్లు కూడాతీసేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇక, సర్ ప్రక్రియను తప్పుబడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఓట్ చోరీ యాత్రలకు కూడా రెడీ అవుతోంది. మరోవైపు.. జనవరి 6వ తేదీన ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇలా.. అనేక వివాదాలతో ముందుకు సాగుతున్న సర్ ప్రక్రియ.. త్వరలోనే తెలంగాణలోనూ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ జ్ఞానేష్ కుమార్.. తాజాగా హైదరాబాద్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో బూత్ లెవిల్ అధికారులతో రవీంద్ర భారతిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సమావేశం నిర్వహించారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తాము చేపట్టిన సర్ ప్రక్రియ నిష్పక్ష పాతంగా..పారదర్శకంగా ముందుకు సాగుతోందని చెప్పారు. అంతేకాదు.. ప్రపంచానికి మార్గదర్శిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అవతరించిందన్నారు. `ఇంటర్నేషనల్ ఇండియా`కు సారథ్యం కూడా వహించ బోతున్నట్టు జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. రాబోయే ఒక సంవత్సరం పాటు అంతర్జాతీయ ‘ఇంటర్నేషనల్ ఐడియా’ సంస్థకు కేంద్ర ఎన్నికల కమిషనరే నాయకత్వం వహించనుందన్నారు. ఇక, తెలంగాణ ఓటర్ల గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ఓటర్లు కెనడా దేశంలో కూడా లేరని.. అంత పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే ఇక్కడ కూడా.. సర్ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపారు.
సర్ ప్రక్రియతోపాటు.. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శక విధానాలకు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోందన్న జ్ఞానేష్ కుమార్.. కొందరు చేసే విమర్శలకు తాము జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలోనూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలోనూ ఎన్నికల సంఘానిది ప్రధాన పాత్రగాఅభివర్ణించారు. అలాంటి ఎన్నికల సంఘానికి బూత్ లెవిల్ ఆఫీసర్లు కీలకమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 930 మంది ఓటర్లకు ఒక బూత్ లెవిల్ అధికారి ఉన్నారని.. వారి వివరాలు తెలుసుకుని నమోదు చేస్తారని.. 2002 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఓటర్లకు ఎలాంటిఇబ్బంది ఉండదన్నారు. బీహార్‌లో నిర్వహించిన ఎన్నికలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని వివరించారు.
కాగా.. తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియలో లోపాలు ఉండడంతోపాటు.. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించడంపై రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ మాత్రం సర్ ప్రక్రియను స్వాగతిస్తుండడం గమనార్హం.
