Begin typing your search above and press return to search.

తెలంగాణలో 92 లక్షల ఓటర్లకు నోటీసులు?.. ఎస్ఐఆర్ లో కీలక పరిణామం

తెలంగాణ ఓటర్ల జాబితాలో ప్రస్తుతం కొనసాగుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని.. చర్చను రేకెత్తిస్తోంది.

By:  A.N.Kumar   |   17 Aug 2026 11:14 PM IST
తెలంగాణలో 92 లక్షల ఓటర్లకు నోటీసులు?.. ఎస్ఐఆర్ లో కీలక పరిణామం
X

తెలంగాణ ఓటర్ల జాబితాలో ప్రస్తుతం కొనసాగుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని.. చర్చను రేకెత్తిస్తోంది. ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర పరిశీలనలో భాగంగా సుమారు 92 లక్షల మంది ఓటర్ల వివరాలు అధికారుల పరిధిలోకి రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో అందుబాటులో ఉన్న రికార్డులతో సరిపోల్చి చూసినప్పుడు వివరాలు సరిగ్గా అమరకపోవడం.. అవసరమైన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడం వంటి అంశాలు ఈ భారీ స్థాయి పరిశీలనకు ప్రధాన కారణంగా మారాయి.

ఈ విశ్లేషణలో ప్రధానంగా రెండు రకాల విభజనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం.. సుమారు 60 లక్షల మంది ఓటర్లను అన్‌వెరిఫైడ్ లేదా అనామలస్ ఓటర్లుగా గురించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 32 లక్షల మంది ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ సవరణలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒకే కుటుంబంలో సభ్యుల వయసుల మధ్య అసాధారణ వ్యత్యాసాలు ఉండటం.. తల్లిదండ్రుల వివరాల్లో తేడాలు నమోదు కావడం.. కేవలం ఆధార్ తప్ప ఇతర ఎలాంటి కీలక పత్రాలు లేకపోవడం వంటి దాదాపు 11 రకాల తార్కిక అసమానతలను అధికారులు గుర్తించారు.

ఇటువంటి అసమానతలు ఉన్న ఓటర్లకు సంబంధిత యంత్రాంగం నుంచి నోటీసులు అందే అవకాశం ఉంది. నోటీసులు అందుకున్న పౌరులు తమ ఓటు హక్కు అర్హతను నిరూపించుకోవడానికి నిర్ణీత సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక అధికారులు సూచించిన వివిధ రకాల ప్రామాణిక గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదానిని ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన ప్రక్రియల అనంతరం ఓటర్ల జాబితాపై అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు.

ఓటరు జాబితాలో పేరు పరిశీలన, నమోదు లేదా సవరణల ప్రక్రియలకు సంబంధించిన సమాచారం కోసం పౌరులు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, తెలంగాణ అధికారిక పోర్టల్‌ను చూడవచ్చు. అలాగే కేంద్రస్థాయి మార్గదర్శకాల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మీ ఓటరు నమోదు స్థితిని స్వయంగా తనిఖీ చేసుకునేందుకు ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ను ఉపయోగించవచ్చు.

నోటీసుల ప్రక్రియతో పాటు క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత తెలంగాణ తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న విడుదల చేయాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ చేసినట్లు సమాచారం. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. భారీ సంఖ్యలో ఓటర్లు పరిశీలనలోకి రావడంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.