Begin typing your search above and press return to search.

నో ‘ప్రెస్’.. తెలంగాణ జర్నలిస్టులకు భారీ షాక్!

ఇటీవల కాలంలో నకిలీ జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

By:  A.N.Kumar   |   26 Jan 2026 3:00 PM IST
నో ‘ప్రెస్’.. తెలంగాణ జర్నలిస్టులకు భారీ షాక్!
X

తెలంగాణ రాష్ట్రంలో వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని ఇష్టానుసారంగా వాడే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై అర్హులైన వారు తప్ప మిగిలిన వారు తమ వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు లేదా లోగోలను వాడటంపై కఠిన ఆంక్షలు విధిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) ఉత్తర్వులు జారీ చేసింది.

అక్రిడిటేషన్ ఉంటేనే అనుమతి

ప్రభుత్వం జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ అధికారిక అక్రిడిటేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై 'ప్రెస్' అని రాసుకోవడానికి అర్హులు. సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ – 1989 నిబంధనలను ఉటంకిస్తూ అనుమతి లేని వారు ఇలాంటి గుర్తులను వాడటం చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు.

ఎందుకీ కఠిన నిర్ణయం?

ఇటీవల కాలంలో నకిలీ జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. యూట్యూబ్ ఛానెళ్లు, చిన్న మీడియా సంస్థల ఐడీ కార్డులను అడ్డం పెట్టుకుని చాలామంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రెస్ స్టిక్కర్లను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించడం, ఇతర అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. నిజమైన జర్నలిస్టులకు గుర్తింపునిస్తూనే నకిలీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

క్షేత్రస్థాయిలో కఠిన అమలు

ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా పౌర సంబంధాల అధికారులకు (డీపీఆర్వో) స్పష్టమైన ఆదేశాలు అందాయి. అక్రిడిటేషన్ లేని వారు వెంటనే తమ వాహనాలపై ఉన్న లోగోలను తొలగించాలని, లేనిపక్షంలో రవాణా, పోలీస్ శాఖల ద్వారా భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది.

జర్నలిస్టుల్లో మిశ్రమ స్పందన

ప్రభుత్వ నిర్ణయంపై జర్నలిస్టు వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీలను అరికట్టడాన్ని ఆహ్వానిస్తున్నప్పటికీ అక్రిడిటేషన్ లేని క్షేత్రస్థాయి రిపోర్టర్ల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చాలా సంస్థల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నా అక్రిడిటేషన్ రాకపోవడం వల్ల, వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీడియా రంగంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ అడుగు వేసినప్పటికీ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.