నోరు అదుపులో ఉండాలి.. తల్లిదండ్రులను చూసుకోవాలి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కీలక చట్టాలను చేయడానికి సంకల్పించింది.
By: Tupaki Political Desk | 23 March 2026 4:26 PM ISTముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కీలక చట్టాలను చేయడానికి సంకల్పించింది. కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు అవుతున్న చట్టాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అత్యంత ప్రధానమైన ఈ రెండు బిల్లుల్లో ఒకదాన్ని సోమవారమే అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా, మరొకటి న్యాయ పరిశీలన అనంతరం ఒకటి రెండు రోజుల్లో సభలో ప్రవేశపెట్టనున్నారని చెబుతున్నారు. విద్వేష ప్రసంగాలతో అశాంతిని సృష్టించేవారిని అదుపు చేయడంతోపాటు వృద్ధులైన తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా కొత్త చట్టాలను ప్రభుత్వం చేస్తోంది.
ప్రస్తుతం కర్ణాటకలో అమలు అవుతున్న విధంగా రాష్ట్రంలోనూ విద్వేష ప్రసంగాలను అరికట్టే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ముసాయిదా తయారు చేయడంతోపాటు సోమవారమే సభలో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఇకపై రాష్ట్రంలో ఎవరైనా విద్వేష ప్రసంగాల ద్వారా కుల, మతాలను రెచ్చగొట్టాలని చూసినా, అశాంతి, అల్లర్లు చెలరేగేలా వ్యవహరించినా కఠినంగా శిక్షిస్తారు. తొలిసారి తప్పు చేస్తే 50 వేల రూపాయల జరిమానాతోపాటు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే రూ.లక్ష జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇప్పటికే ఈ చట్టం కర్ణాటకలో అమలు అవుతుండగా, చక్కని ఫలితం ఇస్తోందని ప్రభుత్వం చెబుతోంది.
ఇదే సమయంలో తల్లిదండ్రుల ఆలనా పాలన చూసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కట్ చేసి, వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తే, అటువంటి వారి జీతాల నుంచి కనీసం 15 శాతం లేదా రూ.10 వేలు కోత పెట్టేలా బిల్లు ముసాయిదా తయారు చేసింది. ఈ డబ్బు నేరుగా ఉద్యోగుల తల్లిదండ్రుల అకౌంట్లకు జమ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అస్సాంలో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మనిటరింగ్ చట్టంగా దీనిని అమలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కూడా ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ (టీఈఏఎంపీఎస్)- 2026 అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడంచాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగుల ప్రవర్తన, సర్వీసు నిబంధనలపై చట్టం చేసేందుకు ఉండే అధికారాన్ని సర్కారు ఈ దిశగా వినియోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007’ పేరుతో ఒక చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం. బాధితులు నేరుగా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి, న్యాయపోరాటం చేయాలి. కేంద్ర చట్టంలో ‘ఆటోమేటిక్ జీతం కోత’ విధానం లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అస్సాం తరహాలో రాష్ట్రంలో చట్టం ఉండాలని భావించి ముసాయిదా రూపకల్పనకు ఆదేశించారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారని ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో ఈ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడుతున్న ఈ రెండు బిల్లులు తీవ్ర సంచలనంగా మారనున్నాయని అంటున్నారు. వాక్ స్వాంత్రం పేరిట ఇకపై ఏది పడితే అది మాట్లాడే స్చేచ్ఛ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అటువంటి వారిని అదుపు చేయాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లుకు రూపకల్పన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించే చట్టాన్ని తీసుకురావడంపైనా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
