Begin typing your search above and press return to search.

బ‌స్సు య‌జ‌మానిపై మ‌ర్డ‌ర్ కేసు పెడ‌తాం: మంత్రి పొన్నం హెచ్చ‌రిక‌

ప‌దుల సంఖ్య‌లో ప్ర‌యాణికుల ప్రాణాలు మంట‌ల్లో క‌లిపేసిన క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంపై తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు.

By:  Garuda Media   |   24 Oct 2025 12:04 PM IST
బ‌స్సు య‌జ‌మానిపై మ‌ర్డ‌ర్ కేసు పెడ‌తాం: మంత్రి పొన్నం హెచ్చ‌రిక‌
X

ప‌దుల సంఖ్య‌లో ప్ర‌యాణికుల ప్రాణాలు మంట‌ల్లో క‌లిపేసిన క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంపై తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్ స‌హా ఆల్ ఇండియా ప‌ర్మిట్‌ల విష‌యంలో లోపాలు ఉన్నట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ట్రావెల్స్ య‌జ‌మానుల‌పైనా.. వారి బ‌స్సుల‌పైనా న‌మ్మ‌కంతో ప్ర‌యాణికులు బ‌స్సులు ఎక్కుతున్నార‌ని.. వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తూ.. ప్రాణాల‌కే ర‌క్ష‌ణ‌లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న బ‌స్సుల య‌జ‌మానుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం.. ట్రావెల్స్‌ యజమానులకు తీవ్ర హెచ్చ‌రిక జారీ చేశారు. ఫిట్‌నెస్‌, ఇన్స్యూరెన్స్‌ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ఆయ‌న సూచించారు. ఇవి లేకుండా బ‌స్సులు న‌డిపే వారిపై హత్యానేరం కింద కేసులు పెడతామ‌ని... లోపలేస్తామ‌ని తెలిపారు. అదేస‌మ‌యంలో స్పీడ్‌ నిబంధనలు పాటించాల‌ని సూచించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని మంత్రి తెలిపారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ఆరోపిస్తున్నారన్న ఆయ‌న‌.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదన్నారు.

ఇటీవ‌ల కాలంలో పెరుగుతున్న ట్రావెల్స్ బ‌స్సుల ప్ర‌మాదాల‌పై చ‌ర్య‌లు తీసుకునేదిశ‌గా అడుగులు వేయ‌నున్న‌ట్టు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల‌కు చెందిన‌ రవాణా శాఖ‌ మంత్రులతో సమావేశం ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో బాధ్యులు ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అమ‌యాకులైన ప్ర‌యాణికుల ప్రాణాలు మంట‌ల్లో క‌లిసి పోవ‌డం తీవ్రంగా క‌ల‌చి వేస్తోంద‌న్నారు.

ఆ బ‌స్సుపై చ‌లాన్లు!

శుక్ర‌వారం తెల్ల‌వారు జామును క‌ర్నూలు జిల్లా చిన్న‌టేకూరులో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో ప‌దుల సంఖ్యలో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ బ‌స్సుపై ఇప్ప‌టికే 16 కు పైగా కేసులు పెండింగులో ఉన్నాయ‌ని క‌ర్నూలు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ మొత్తం కేసూఉల‌కు సంబంధించి 23 వేల రూపాయ‌ల‌కు పైగా జ‌రిమానాలు క‌ట్టాల్సి ఉంద‌న్నారు.

ఇవీ కేసులు..

+ 27 జనవరి 2024 నుంచి.. 9 అక్టోబర్ 2025 వరకు: 16 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు.

+ 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి బస్సు ప్రవేశం.

+ మితిమీరిన వేగం, ప్ర‌మాద‌క‌ర‌ డ్రైవింగ్ లోనూ జరిమానాలు ఉన్నాయి.