Begin typing your search above and press return to search.

తాటిచెట్టుపై సీసీ కెమెరా ఏంది సామీ.. ఐడియా అదిరింది గౌడన్నా..

తెలంగాణలో చల్లటి తాటి కల్లుకు ఉన్న గిరాకీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

By:  A.N.Kumar   |   7 Aug 2026 10:46 PM IST
తాటిచెట్టుపై సీసీ కెమెరా ఏంది సామీ.. ఐడియా అదిరింది గౌడన్నా..
X

తెలంగాణలో చల్లటి తాటి కల్లుకు ఉన్న గిరాకీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఊళ్లో మందు షాపులు ఎంతలా పుట్టగొడుగుల్లా వెలిసినా ఉదయాన్నే తాటిచెట్టు కింద కూర్చుని ఫ్రెష్ కల్లు తాగే అనుభూతిని ఏ బ్రాండ్ బ్రాందీ కూడా ఇవ్వలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కల్లు దొంగలు ఎక్కువైపోయి మన గీత కార్మికుల కష్టానికి పెద్ద కన్నం వేస్తున్నారు. పాపం కష్టపడి పొద్దున్నే లేచి చెట్టెక్కి ముంతలు కడితే రాత్రికి రాత్రే కేటుగాళ్లు వచ్చి సీక్రెట్‌గా ఫ్రీగా తాగేసి పారిపోతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అన్నెపు శ్రవణ్ గౌడ్ పరిస్థితి కూడా రోజూ ఇంతే అయ్యింది. రోజువారీ కష్టమంతా దొంగల పాలవుతుంటే చూడలేకపోయాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తాటిచెట్టుపై దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి మనసొప్పలేదు. అందుకే మన గౌడన్న మామూలుగా ఆలోచించలేదు. ఏకంగా 'హైటెక్ సెక్యూరిటీ' లెవెల్లో స్కెచ్ వేశాడు. తాటి చెట్టు పైన కరెంట్ ఉండదు కాబట్టి, అసలు ఏమాత్రం తగ్గకుండా ఏకంగా సోలార్ సీసీ కెమెరాను అమర్చేశాడు.

నన్ను దోచుకోవడానికి చెట్టెక్కుతావా బాస్, నిన్ను లైవ్‌లో ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో రికార్డ్ చేసి మీ ఇంటికే పంపిస్తా అన్నట్లుగా ఆ కెమెరా చెట్టుపై నుండి పహారా కాస్తోంది. రోజుకు దాదాపు పన్నెండు వందల రాబడిని ఎగ్గొట్టే దొంగలను ఊరికే వదులుతాడా మరి? ఇప్పుడు సీసీ కెమెరా పుణ్యమా అని దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చెట్టు వైపు చూడాలంటేనే కెమెరాలో పడిపోతామేమో అని భయపడి ఆ చెట్ల దరిదాపుల్లోకి రావడమే మానేశారు.

ప్రస్తుతం ఈ సోలార్ సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మన గౌడన్న మామూలోడు కాదు భయ్యో ఎలోన్ మస్క్ కూడా ఈ ఐడియా చూస్తే శాల్యూట్ చేయాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపై ఉదయాన్నే ఫ్రెష్ కల్లుతో పాటు రాత్రి ఎవరు దొంగిలించారో తెలిపే క్రైమ్ సీన్ రికార్డింగ్స్ కూడా లైవ్‌లో చూడొచ్చన్నమాట అని జోకులు పేలుస్తున్నారు.

ఏది ఏమైనా సాంకేతికతను కేవలం సాఫ్ట్‌వేర్ ఆఫీసులకే పరిమితం చేయకుండా తాటిచెట్టు దాకా తీసుకెళ్లిన శ్రవణ్ గౌడ్ తెలివితేటలకు అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు. దొంగతనాలు ఆపడానికి ఈ 'స్మార్ట్ గౌడన్న' చూపించిన బాట, ఇప్పుడు మిగతా కార్మికులకు కూడా ఒక క్రేజీ గైడ్‌లా మారింది.