Begin typing your search above and press return to search.

తూచ్ అలా అనలేదు.. టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి యూటర్న్

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది.

By:  A.N.Kumar   |   12 Jan 2026 7:31 PM IST
తూచ్ అలా అనలేదు.. టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి యూటర్న్
X

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆపై తీసుకున్న 'యూటర్న్' ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ చిత్రాల టికెట్ ధరల పెంపు చుట్టూ పెద్ద హైడ్రామా నడుస్తోంది. ఈ వివాదంలో స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.

ఒక్క శనివారం.. ఎన్నో సంచలనాలు!

శనివారం మీడియా ముందు మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశాను’’ అని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన సినిమాల టికెట్ రేట్ల పెంపు ఫైళ్లు తన దగ్గరకు రాలేదని.. అసలు ఆ జీవోలు ఎలా జారీ అయ్యాయో తనకు తెలియదని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకవైపు మంత్రి తనకు తెలియదంటుంటే, మరోవైపు హైకోర్టు మంత్రి వద్దంటున్నా అధికారులు జీవోలు ఎలా ఇస్తున్నారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది.

సోమవారం యూటర్న్.. అసలు క్లారిటీ ఇదే!

అయితే సోమవారం నాటికి మంత్రి కోమటిరెడ్డి మాట మార్చారు. టికెట్ ధరల పెంపు వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరిస్తూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అందరం కూర్చుని చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెరిగిన టికెట్ ధరల లాభాల్లో 20 శాతం వాటాను సినిమా కార్మికుల సంక్షేమ నిధికి అందజేయాలనే నిబంధనతోనే ఈ అనుమతులు ఇచ్చామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి శాఖలోనూ జోక్యం చేసుకోరని.. వైఎస్సార్ గారిలా మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిస్తారని పేర్కొంటూ తన శాఖపై తనకే పట్టుందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు

ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేతలపై కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. "పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. ప్రతి చిన్న విషయానికి కాంగ్రెస్‌ను నిందించడం మానుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు.

గందరగోళానికి తెరపడినట్లేనా?

మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నప్పటికీ ఒకే అంశంపై రెండు రోజుల్లో రెండు రకాలుగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది ప్రభుత్వంలోని సమన్వయ లోపమా? లేక వ్యూహాత్మక మార్పా? అన్నది పక్కన పెడితే.. సామాన్య ప్రేక్షకుడు మాత్రం భారీగా పెరిగిన టికెట్ ధరలతో భారానికి గురవుతున్నాడు.