Begin typing your search above and press return to search.

తెలంగాణలో కారు కొనే వారికి చేదువార్త.. పన్నుల్ని పెంచిన ప్రభుత్వం

కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? ఖరీదైన టూవీలర్ కు ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఈ సమాచారం గురించి తెలుసుకోవాల్సిందే.

By:  Garuda Media   |   14 Aug 2025 11:46 AM IST
తెలంగాణలో కారు కొనే వారికి చేదువార్త.. పన్నుల్ని పెంచిన ప్రభుత్వం
X

కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? ఖరీదైన టూవీలర్ కు ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఈ సమాచారం గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. కొత్త వాహనాల్ని కొనుగోలు చేసే వారిపై అదనపు పన్ను వడ్డింపును ఓకే చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వును జారీ చేసింది. ఖరీదైన కార్లపై ఒకటి నుంచి ఆరు శాతం వరకు అదనంగా లైఫ్ ట్యాక్స్ ను వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఫ్యాన్సీ నెంబర్ల కోసం తహతహలాడే వారికి షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణకు మార్చుకునే వారికి కొత్త భారం తప్పదు.

తాజాగా విడుదలైన అధికారిక ఉత్తర్వులో (జీవో నెంబరు 53, 54) పేర్కొన్న అంశాలేమిటి? అన్నది చూస్తే..

టూవీలర్ శ్లాబులు 2 నుంచి 4 శాతానికి పెరిగాయి.

కార్లు.. జీపుల శ్లాబులు 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి.

కార్లు.. జీపుల విషయానికి వస్తే..

కొత్తగా కొనే కారు రూ.10 లక్షలు లోపు ఎక్స్ షోరూం ధర అయితే ఎలాంటి అదనపు భారం ఉండదు. ఇప్పుడున్న విధానమే అమలవుతుంది. అందుకు బిన్నంగా ఎక్స్ షోరూం ధర రూ.10 లక్షలు దాటితే ఒకశాతం పెరుగుతుంది. అదే రూ.20 లక్షలు దాటితే ఒక శాతం.. అదే రూ.50 లక్షలు దాటితే మాత్రం 2 శాతం అదనంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత వాహనాల మీద కొత్త వడ్డన ఇలా ఉంటే. .కంపెనీలు, సంస్థలకు సంబంధించి కొనుగోలు చేసే పది సీట్లకు మించిన వాహనాల ధర రూ.20 లక్షలకు పైనే ఉంటే ఇప్పటివరకు లైఫ్ ట్యాక్స్ 20 శాతంగా ఉండేది. అదిప్పుడు రెండు శ్లాబులుగా మార్చారు. రూ.20-రూ.50 లక్షల విలువ ఉండే వాహనాల మీద 22 శాతం.. అదే రూ.50 లక్షలు దాటితే 25 శాతం లైఫ్ ట్యాక్స్ ను కట్టాల్సి ఉంటుంది.

టూవీలర్ విషయానికి వస్తే.. ఎక్స్ షోరూం ధర రూ.లక్ష లోపు ఉంటే ఎలాంటి అదనపు భారం పడదు. ఇప్పటివరకు అమల్లో ఉన్న లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే సరి. అదే ధర రూ.లక్ష దాటితే 3 శాతం.. వాహనం ధర రూ.2 లక్షలు దాటితే ఆరు శాతం లైఫ్ ట్యాక్స్ పెరుగుతుంది. పేరుకు మూడు శాతంగా ఉన్నప్పటికి రూ.లక్ష దాటిన టూవీలర్ కొనుగోలు మీద అదనంగా పడే భారం లెక్క చూస్తే ఎక్కువన్న విషయం అర్థమవుతుంది.

ఇప్పటివరకు అమలైన విధానంలో టూవీలర్ ఎక్స్ షోరూం ధర రూ.1.10 లక్షలు అయితే రూ.13,200 లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంలో ఇది కాస్తా రూ.16,500గా మారుతుంది. వాహనం ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ల మీద ఉండే మోజు ఎంతన్నది అందరికి తెలిసిందే. టూవీలర్లతో పోలిస్తే ఫోర్ వీలర్ల మీద ఈ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశం మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫ్యాన్సీ నెంబర్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ఉన్న ఐదు శ్లాబుల స్థానే ఏడుకు పెంచింది. ఇప్పటివరకు 9999 నెంబరు కోసం గతంలో రూ.50 వేలు కనీస ధరగా కోట్ చేయాల్సి ఉంటే.. ఇప్పుడు అది ఏకంగా రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్లకు గతంలో ఉన్న ఐదు శ్లాబుల్లో రూ.50, 30, 20, 10, 5 వేలుగా ఉండేది.అదిప్పుడు రూ.1.5 లక్షలు.. రూ.లక్ష.. రూ.50వేలు.. రూ.40వేలు రూ.30వేలు.. రూ.20 వేలు.. రూ.6వేలుగా నిర్ణయించారు. మొత్తంగా కొత్త వాహనం అది కూడా బేసిక్ వాహనం కాకుండా కాస్తంత ఖరీదైతే పన్నుబాదుడు పక్కా కానుంది.