సీనియర్ స్వీపర్ జీతం రూ. 2 లక్షలు.. రివ్యూ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఆసక్తికర విషయాలు..
డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి, నెలకు ముప్పై వేల జీతం కోసం నానా తంటాలు పడే కుర్రాళ్లకు ఈ వార్త వింటే గుండె ఆగుతుందేమో.
By: Tupaki Political Desk | 12 May 2026 10:45 AM ISTడిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి, నెలకు ముప్పై వేల జీతం కోసం నానా తంటాలు పడే కుర్రాళ్లకు ఈ వార్త వింటే గుండె ఆగుతుందేమో. ఈ వార్త విన్న తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగులంతా రెజ్యూమ్ లో స్కిల్స్ వద్ద 'జావా, పైథాన్' తీసేసి 'స్వీపింగ్, క్లీనింగ్' అని మార్చుకునే పనిలో పడుతారు కావచ్చు. ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కలలో కూడా ఊహించని ఈ వేతనాల మాయాజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
ఒక స్వీపర్ జీతం నెలకు ఎంత ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థనా.. ప్రైవేట్ సెక్టారా.. రెడింటికీ తేడా ఉంటుంది.. ప్రభుత్వ రంగమే అయినా ఎంత ఉంటుంది.. మా అంటే రూ. 10వేలు, ఈ కాలంలో పది వేల పనే లేదు.. సరే.. రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు ఒకే.. కానీ ఇక్కడ అంత కాదు ఏకంగా రూ. 2 లక్షలు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీతాల కంటే కూడా ఇవి ఎక్కువగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇటీవల జరిగిన 16వ ఆర్థిక సంఘం రివ్యూ మీటింగ్‌లో ఈ ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ రంగ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో వేతనాలు ఇతర శాఖల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఎవరికి ఎంత జీతం?
రివ్యూ మీటింగ్‌లో వెల్లడైన వివరాల ప్రకారం.. సుమారు 20-30 ఏళ్ల సర్వీస్ ఉన్న సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (స్వీపర్లు, అటెండర్లు) నెలకు రూ. 2 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. పవర్ యుటిలిటీస్‌లో పనిచేసే చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారుల వేతనం నెలకు ఏకంగా రూ. 7 లక్షల వరకు ఉంది. జీహెచ్‌ఎంసీ వంటి సంస్థల్లోని రెగ్యులర్ శానిటేషన్ వర్కర్లు కూడా సుమారు రూ. 70,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదిస్తున్నారు.
ఇంత జీతాలకు కారణం..
ఈ శాఖలో వేతనాలు ఇంత భారీగా ఉండటానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి పీఆర్సీ (PRC) అమలు జరుగుతుంటే, విద్యుత్ శాఖలో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన వరుస వేతన సవరణలు, డీఏ (DA) పెరుగుదలలు ఈ జీతాలను ఐఏఎస్ అధికారుల వేతనాల కంటే పైకి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సగటు వయస్సు 50 ఏళ్లు ఉండటం వల్ల, సుదీర్ఘ సర్వీసులో వారికి వచ్చిన ఇంక్రిమెంట్లు జీతాలను ఈ స్థాయికి చేర్చాయి.
పెరుగుతున్న ఆర్థిక భారం
జీతాల పెరుగుదల వల్ల రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరుగుతోందని సీఎస్ రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు నెలకు జీతాలు, పెన్షన్ల కోసం రూ. 1,500 కోట్లు ఖర్చు అయ్యేది, ప్రస్తుతం అది రూ. 6,000 కోట్లకు చేరింది. గత పదేళ్లలో రాష్ట్రం చేసిన మొత్తం రూ. 15 లక్షల కోట్ల వ్యయంలో దాదాపు రూ. 12 లక్షల కోట్లు కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపులకే ఖర్చయ్యాయి.
ఇంత భారీ వేతనాలు ఉండడం వల్లే ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన 563 గ్రూప్-1 పోస్టుల కోసం ఒక్కో పోస్టుకు సగటున 799 మంది అభ్యర్థులు పోటీ పడటం దీనికి నిదర్శనం.
