Begin typing your search above and press return to search.

హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం

హైదరాబాద్ మహానగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   8 Jan 2026 1:23 PM IST
హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం
X

హైదరాబాద్ మహానగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున (గురువారం) ఈ విషాద ఉదంతంలో నలుగురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ఇక్ఫాయ్ వర్సిటీ విద్యార్థులు కాగా మరొకరు మరో కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు. పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న వేళలో.. వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే..

కోకాపేట్ లో పుట్టిన రోజు పార్టీ చేసుకున్న స్నేహితుల బృందం ఒకటి.. లేట్ నైట్ తర్వాత తిరిగి తమ నివాసాలకు తిరిగి వెళుతున్నారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. అమితమైన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. దీంతో.. చెట్టును బలంగా ఢీ కొనటంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది.

కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో విద్యార్థులు సూర్యతేజ్, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ లు అక్కడికక్కడే మరణించారు. కారులోని యువతిని నక్షత్రగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

మరణించిన విద్యార్థుల వివరాల్ని సేకరిస్తున్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో నగర శివారు కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు.. లేట్ నైట్ పార్టీలకు వెళ్లి రావటం.. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ తీరును సదరు కాలేజీలు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.