ప్రతి తండ్రి తప్పక చదవాల్సిన సర్వే వివరాలివి!
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యయనానికి.. ఉస్మానియా వర్సిటీకి చెందిన అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులపై ఈ సర్వే ను చేపట్టారు.
By: Garuda Media | 27 Jan 2026 12:00 PM ISTఆసక్తికర సర్వే వివరాలు వెల్లడయ్యాయి. కాకుంటే.. ఈ సర్వే తెలంగాణలో మాత్రమే నిర్వహించారు. ఇంట్లో పిల్లలు.. వారి చదువులు.. వారి కెరీర కోసం అదే పనిగా ఆందోళన చెందే తల్లిదండ్రుల తీరు కామన్ గా ఉంటుంది కాబట్టి.. ఈ సర్వేలో గుర్తించిన అంశాలన్ని కాస్త అటు ఇటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికి వర్తిస్తాయని చెప్పక తప్పదు. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లోని మూడో వంతు మందిలో ఏదో ఒక సమస్య వెంటాడుతుందన్న కీలక అంశాన్ని తాజా సర్వే స్పష్టం చేసింది.
నూటికి 59 శాతం విద్యార్థుల్లో వారికున్న మానసిక సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ కావాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్న కీలక అంశాన్ని ఈ సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదివే గ్రాడ్యుయేషన్ విద్యార్థుల్లో మూడో వంతు మంది విద్యార్థులు ఏ మాత్రం సంతోషంగా లేరు కుటుంబ ప్రోత్సాహం లేకపోవటం.. ఆర్థిక.. కమ్యూనికేషన్ సమస్యలు.. ఫ్యూచర్ మీద ఆందోళనలు.. లాంటి సమస్యలు వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యయనానికి.. ఉస్మానియా వర్సిటీకి చెందిన అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులపై ఈ సర్వే ను చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తించిన అంశాలు ఆసక్తికరంగానే కాదు.. తల్లిదండ్రులను మేలుకొలిపేలా ఉన్నాయని చెప్పాలి. సర్వేలో దాదాపు 2800 మంది విద్యార్థులు పాల్గొంటే.. వీరిలో అమ్మాయిలు 56 శాతం.. అబ్బాయిలు 43 శాతం. ఇందులో 62 శాతం నగరాలు.. పట్టణాలకు చెందిన వారు కాగా.. 37 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్నారు.
చదువుల్లో ప్రతిభ చూపుతామా? లేదా? అన్న ఆందోళన.. పరీక్షలు.. బ్యాక్ లాగ్ లపై భయం.. ఫ్యూచర్ లో మంచి ఉద్యోగాలు వస్తాయో? లేదో? అన్న బెంగ.. లక్ష్యాన్ని చేరుకోవటంపై సందిగ్థత.. ఆత్మస్థైర్యం తక్కువగా ఉండటం.. తమను తాము తక్కువగా అంచనా వేసుకోవటం లాంటి సమస్యల్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు కుటుంబ సంఘర్షణలు.. ఆర్థిక అభద్రత.. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు.. పేదరికం కారణంగా ఒత్తిడి లాంటివి విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
వీటికి తోడు విద్యా పరమైన అంశాల్లో కుటుంబ మద్దతు లేని విద్యార్థులు 23 శాతం మంది ఉంటే.. చదువుకు అవసరమైన ఆర్థిక సహకారం లేని వారు 36 శాతం మంది ఉన్నారు. వివిధ పరిస్థితులకు అనుగుణంగా బాగా మాట్లాడే సామర్థ్యం లేనోళ్లు 41 శాతం మంది ఉన్నట్లు గుర్తించారు. అన్నింటికి మించి సర్వేలో పాల్గొన్న వారిలో 59 వాతం మంతి కౌన్సెలింగ్ కోరుకోవటం కీలక అంశంగా చెప్పాలి. ఇంగ్లిషులో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నోళ్లు 31 శాతం మందిగా గుర్తించారు. మొత్తంగా విద్యార్థుల్లో అత్యధికులు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని.. వారిని సమస్యల సుడిగుండం నుంచి వెలికి తీయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నది మర్చిపోకూడదు.
