Begin typing your search above and press return to search.

తెలంగాణ క్రీడా రంగానికి ఊపిరిగా ఉపాసన

ఈ చారిత్రక నిర్ణయంలో ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ అయిన ఉపాసన కామినేనిని ఈ బోర్డుకు కో-చైర్‌పర్సన్‌గా నియమించారు.

By:  A.N.Kumar   |   3 Aug 2025 11:26 PM IST
తెలంగాణ క్రీడా రంగానికి ఊపిరిగా ఉపాసన
X

తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో ఒక విప్లవాత్మక అడుగు వేసింది. క్రీడా విధానం 2025లో భాగంగా రాష్ట్ర క్రీడల అభివృద్ధికి కొత్త ఊపిరి పోయడానికి గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ చారిత్రక నిర్ణయంలో ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ అయిన ఉపాసన కామినేనిని ఈ బోర్డుకు కో-చైర్‌పర్సన్‌గా నియమించారు.

ఈ బోర్డుకు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త డా. సంజీవ్ గోయెంకా వ్యవహరిస్తారు. అయితే, ఈ బోర్డులో కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాకుండా, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సభ్యులుగా చేర్చడం ఈ నిర్ణయం యొక్క ప్రత్యేకత. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ మాస్ట్రో పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, ఫుట్‌బాల్ లెజెండ్ బైచుంగ్ భుటియా వంటి క్రీడా ప్రముఖులతో పాటు, క్రీడా పారిశ్రామికవేత్త వితా దానీ, క్రీడల నిర్వహణ నిపుణురాలు కావియా మారన్, ఇంకా క్రీడా పరిపాలనలో అనుభవం ఉన్న రవికాంత్ రెడ్డి, బయ్యాల పాపారావు వంటి నిపుణులు ఇందులో భాగం కావడం విశేషం. వివిధ రంగాల నిపుణులతో ఇలాంటి బోర్డును ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది.

ఈ బోర్డు ప్రధాన లక్ష్యం, క్రీడల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి సక్రమంగా వినియోగపడాలి, ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులకు కూడా సరైన అవకాశాలు దక్కాలి. ఈ విధంగా తెలంగాణ క్రీడారంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈ బోర్డు కేవలం ఒక పాలనా మండలి మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలోని అన్ని క్రీడా కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా "TS స్పోర్ట్స్ హబ్" గా మారనుంది.

తెలంగాణ క్రీడాశాఖ మంత్రి మాట్లాడుతూ "ఈ బోర్డు రాష్ట్ర క్రీడా రంగ స్వరూపాన్ని మార్చేస్తుంది. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం" అని తెలిపారు. ఆగస్టు నుండి ఈ బోర్డు తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇది ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడమే కాకుండా, క్రీడల చుట్టూ ఒక పటిష్టమైన మార్కెట్‌ను నిర్మించడానికి కూడా దోహదపడుతుంది.

ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి పతక విజేతలు రావాలన్నది ఇప్పుడు ఒక కల కాదు, అది సాధ్యం కాబోయే లక్ష్యంగా మారింది. ఈ కొత్త బోర్డు తెలంగాణ క్రీడా రంగంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చు.