ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. తెలంగాణలో కీలక పరిణామం
సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కదలిక మొదలైంది.
By: Tupaki Political Desk | 20 Nov 2025 7:19 PM ISTసుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కదలిక మొదలైంది. వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ వైపు మొగ్గిన ఇద్దరు శాసన సభ్యులకు మళ్లీ నోటీసులు జారీ చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది గతంలో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు జవాబులిచ్చారు. వీరిపై విచారణ కొనసాగుతోంది. దానం, కడియం మాత్రం తమకు మరికొంత సమయం అడిగారు. వీరిలో దానం నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈయన రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఢిల్లీ వెళ్లారని కూడా అంటున్నారు. ఇలాంటి సమయంలో స్పీకర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
అఫిడవిట్ ఎప్పుడో?
అనర్హత పిటిషన్లపై తమకు జారీచేసిన నోటిసులకు సంబంధించి దానం, కడియం ఎప్పుడు అఫిడవిట్ జారీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. అందుకే వీరికి మళ్లీ నోటీసులిచ్చారు. మరోవైపు ఫిరాయింపు ఆరోపణలున్న ఎమ్మెల్యేల విచారణకు తుది గడువు గురువారమే. ఇప్పటికే సుప్రీం కోర్టు ఆగ్రహంతో పాటు నాలుగు వారాల గడువు విధించింది. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచుతున్నారు.
మలి విడత విచారణకు నలుగురు
స్పీకర్ చేపట్టిన మలి విడత విచారణకు నలుగురు ఎమ్మెల్యేలను పిలిచారు. వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి, అరికెపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసులను స్పీకర్ విచారించారు. మొత్తం 8 మంది విచారణ పూర్తి అయింది. అయితే, దానం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నందున విచారణకు రాలేదని సమాచారం. ఒకవేళ తాను విచారణకు హాజరైతే గనుక వేటు ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీచేయడమే. వేటు పడితే ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి.
రాజీనామా ఖాయమా?
దానం తన పరిస్థితుల రీత్యా రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు. అప్పుడేం చేయాలి? అని కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారు. మరోవైపు స్పీకర్ తన నోటీసులకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. ఇప్పటికే విచారణ పూర్తయిన ఎమ్మెల్యేల విషయమై న్యాయ సలహాలు, సూచనలు తీసుకుని స్పీకర్ నిర్ణయం వెల్లడించే చాన్సుంది.
