'సర్' ఎఫెక్ట్: తెలంగాణలో 74 లక్షల ఓట్లు ఫట్!
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పిటిషన్(సర్) ప్రక్రియ సోమవారం ముగిసింది.
By: Garuda Media | 11 Aug 2026 11:42 AM ISTతెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పిటిషన్(సర్) ప్రక్రియ సోమవారం ముగిసింది. ముసాయిదా జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చిన వారితో పోల్చుకుంటే.. దాదాపు 74 లక్షల మంది తిరిగి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వీరి ఓట్లు ముసాయిదా జాబితా నుంచి పూర్తిగా తొలిగిపోయినట్టేనని తెలిపారు. అయితే.. వీరిలో శాస్వత నివాసం లేని వారు... వలస పోయినవారు, మృతి చెందిన వారే ఎక్కువగా ఉండి ఉంటారని భావిస్తున్నారు.
ఇవీ కీలక విషయాలు..
మొత్తం ఓటర్లు: 3,38,26,448
ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిన వారు: 2,64,30,494
ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి రానివి: 73,95,954
ప్రస్తుత అంచనా ప్రకారం ఓట్ల రద్దు: 73,95,954
ఇప్పటి వరకు పూర్తయిన డిజిటలైజేషన్: 78 శాతం మాత్రమే.
17న ముసాయిదా..
ఇప్పటి వరకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా డిజిటలైజేషన్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. వీటికి సంబంధించిన ముసాయిదా జాబితాను పోలింగ్ బూత్‌ల వారీగా ఈ నెల 17న విడుదల చేయనున్నారు. అయితే.. దీనికి ముందే.. రాష్ట్ర ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేసేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా 74 లక్షల మేరకు ఓట్లు గల్లంతు కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వనట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఓట్లు పోయే అవకాశం కనిపిస్తోందని అంచనా వేశారు. ఇదిలావుంటే.. ఇప్పటికే `సర్` ప్రక్రియను తెలంగాణలో రెండు సార్లు పొడిగించారు. అయినా.. ఎన్యూమరేషన్ ఫారాలు చాలా మటుకు వెనక్కి రాకపోవడం గమనార్హం. దీంతో ఆయా ఓట్లు ఇక లేనట్టేనని చెబుతున్నారు.
