ఇదేం చలిరా నాయనా: వణుకుతున్న తెలంగాణ.. మరో 3 రోజులు తప్పదట
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు అదే పనిగా వారాల కొద్దీ నమోదు అవుతున్న వేళ.. సామాన్య ప్రజలు చలితో వణికిపోతున్నారు.
By: Garuda Media | 11 Jan 2026 10:05 AM ISTసరిగ్గా ఏడాది క్రితం.. సంక్రాంతికి ముందే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవటమే కాదు.. చలి తగ్గి వేడి గాలులు ఎంట్రీ ఇచ్చేసిన పరిస్థితి. సంక్రాంతి నాటికి ఈ తేడాను అందరి అనుభవంలోకి వచ్చేసిన పరిస్థితి. తాజాగా అందుకు భిన్నమైన సీన్ తెలంగాణలో నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది వింటర్ లో చలి వణుకు భారీగా ఉండటమే కాదు.. చల్లగాలులకు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు అదే పనిగా వారాల కొద్దీ నమోదు అవుతున్న వేళ.. సామాన్య ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఈ పరిస్థితికి కొనసాగింపుగా గడిచిన వారంగా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు రోజులు దాటితే చలి తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నా.. వాతావరణంలో మార్పులు రాని పరిస్థితి. తాజాగా తెలంగాణ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్.
అదేమంటే రానున్న మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని..కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు చలిగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఇదే తీరు మరో మూడు రోజులు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఎందుకిలా అంటే.. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు.. ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిగాలులు వీస్తున్నాయి.
దీంతో రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15డిగ్రీల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు పడిపోతాయనిచెబుతున్నారు. తాజాగా చూస్తే సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.9డిగ్రీలు నమోదైతే.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.చాలా జిల్లాల్లో తొమ్మిది నుంచి పన్నెండు డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలిగాలుల విషయంలో పెద్దవయస్కులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి వణుకుడు మధ్యే ముగిసేలా ఉందని చెప్పక తప్పదు.
