Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌.. రీజ‌నేంటి?

తెలంగాణ‌లో మ‌రోసారి ఓట‌ర్ల జాబితాల‌ను స‌వ‌రించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం రెడీ అయింది.

By:  Garuda Media   |   20 Nov 2025 8:44 AM IST
తెలంగాణ‌లో మ‌ళ్లీ ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌.. రీజ‌నేంటి?
X

తెలంగాణ‌లో మ‌రోసారి ఓట‌ర్ల జాబితాల‌ను స‌వ‌రించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం రెడీ అయింది. దీనికి సంబంధించి తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో ఓట‌ర్ల జాబితాల‌ను స‌వ‌రించ‌నున్నారు. అదేస‌మ‌యం లో కొత్త ఓట‌ర్ల‌ను కూడా చేర్చుకోనున్నారు. న‌కిలీ ఓట‌ర్లు.. అడ్ర‌స్ స‌రిగా లేని వారిని కూడా ప‌క్క‌న పెట్ట‌నున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి రాణి కుముదిని ఆదేశాలు ఇచ్చారు. దీని ప్ర‌కారం.. గురువారం(న‌వంబ‌రు 20) నుంచి ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

ఇది కేవ‌లం మూడు రోజులు మాత్ర‌మే కొన‌సాగ‌నుంది. గ్రామీణ స్థాయిలో ఓట‌ర్ల‌ను మ‌రోసారి క‌లుసుకుని.. వారి వివ‌రాల‌ను తెలుసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. 20వ తేదీన ఓట‌ర్ల‌కు ద‌ర‌ఖాస్తులు ఇవ్వాల‌ని(కొత్త‌వారికి), అదేవిధంగా ఏదైనా త‌ప్పులు ఉన్న వారి విష‌యంలోనూ ద‌ర‌ఖాస్తులు ఇచ్చి స‌వ‌రించాల‌ని కూడా ఆదేశించింది. అనంత‌రం.. తుది ఓట‌ర్ల జాబితాను(గ్రామీణ ప్రాంతాల‌కు మాత్ర‌మే) ఈ నెల 23 నుంచి ప్ర‌చురించ‌నున్నారు. ఆయా గ్రామాల్లోని పంచాయ‌తీలు స‌హా ప‌లు కార్యాల‌యాల్లోనూ.. ఓట‌ర్ల జాబితాను అందుబాటులో ఉంచ‌నున్నారు.

ఎందుకు?

అయితే.. ఇప్ప‌టికే ఒక‌సారి ఎన్నిక‌ల సంఘం రాష్ట్రంలోని ఓట‌ర్ల జాబితాను స‌వ‌రించింది. వారికి ఫొటో ఐడెంటిటీ కార్డుల‌తో పాటు.. కొత్త జాబితాల‌ను కూడా ప్ర‌క‌టించింది. అంతేకాదు.. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు గ‌త నెల‌లో స‌మాయ‌త్తం కూడా అయింది. ఇక‌, రేపు ఎన్నికల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌నగా.. కోర్టు నిర్ణ‌యంతో వాయిదా వేశారు. ఇక‌, ఇప్పుడు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారంపై రాష్ట్ర సర్కారు తీసుకునే నిర్ణ‌య‌మే కీల‌కం కానుంది. రిజ‌ర్వేష‌న్ల‌ను పాత విధానంలోనే అమలు చేసి.. పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించుకుంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

అలాకాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన 42 శాతం రిజ‌ర్వేష‌న్‌(బీసీల‌కు) అమ‌లు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకుంటే.. మాత్రం అటు గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంలేదా.. ఇటు హైకోర్టు నిర్ణ‌యం కీల‌కం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం న్యాయ స‌ల‌హా తీసుకుంది. ఈ నెల 24న కోర్టులోనూ ఈ విష‌యంపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఏక్ష‌ణ‌మైనా గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు ఓట‌ర్ల జాబితాను స‌వ‌రించే ప్ర‌క్రియ‌కు మ‌రోసారి శ్రీకారం చుట్టారు.