Begin typing your search above and press return to search.

రైట్ రైట్: అర్థరాత్రి వేళ చర్చలు సక్సెస్.. టీఆర్టీసీ సమ్మెకు చెల్లుచీటి

ఆర్టీసీ సమ్మె కొలిక్కి వచ్చేందుకు.. సమ్మెకు సొల్యూషన్ వెతికే విషయంలో ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి వ్యవహారం కీలకంగా మారిందన్న అభిప్రాయపడింది.

By:  Garuda Media   |   25 April 2026 10:49 AM IST
రైట్ రైట్: అర్థరాత్రి వేళ చర్చలు సక్సెస్.. టీఆర్టీసీ సమ్మెకు చెల్లుచీటి
X

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై స్పందించిన రేవంత్ సర్కారు.. అందుకు తగ్గట్లే కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపటంతో పాటు.. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించటంతో.. మూడు రోజుల సమ్మె ముగిసింది. కార్మిక సంఘాల డిమాండ్లపై చర్చించిన సర్కారు.. పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించటంతో శుక్రవారం నాన్ స్టాప్ గా సాగిన పదమూడు గంటలకు పైగా సాగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో శనివారం తొలి షిప్టు నుంచి బస్సులు రోడ్డు మీదకు ఎక్కడున్నాయి.

ఆర్టీసీ సమ్మె కొలిక్కి వచ్చేందుకు.. సమ్మెకు సొల్యూషన్ వెతికే విషయంలో ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి వ్యవహారం కీలకంగా మారిందన్న అభిప్రాయపడింది. శంకర్ గౌడ్ ఉదంతానికి ముందు వరకు.. ప్రభుత్వ వైఖరి ఒకలా.. ఆత్మాహుతి యత్నం గురించి తెలిసినంతనే ప్రభుత్వం తీరులో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకంటూ.. సమ్మెకు దిగిన వారి విషయంలో సానుకూలంగా స్పందించకుంటే తప్పు అవుతుందన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పెరిగినట్లుగా చెబుతున్నారు.

సమ్మె విషయంలో సానుకూలంగా స్పందించకుంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని సమ్మెకు.. ప్రజా ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకునే రేవంత్ సర్కారుకు తేడా ఏముంటుందన్న వాదన బలంగా రావటం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన న్యాయమైన డిమాండ్లపై తక్షణమే స్పందించాలని.. సానుకూలంగా రియాక్టు కావాలన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పెరిగినట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే ముఖ్యమంత్రి రేవంత్ సైతం.. సమ్మెను వీలైనంత త్వరగా ముగిసేలా చర్యలు తీసుకోవాలన్న మాటతో ఉప ముఖ్యమంత్రి భట్టి.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఉప ముఖ్యమంత్రి..మంత్రుల టీంతో జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఐకాస నాయకులు ప్రభుత్వం ముందు 32 డిమాండ్లను ఉంచగా.. కీలకమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 11 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు.. గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఐకాస సానుకూలంగా స్పందించారు. ఆత్మాహుతి చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలు.. ఇందిరమ్మ ఇల్లుతో పాటు వారి ఇంట్లోని ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది.

శుక్రవారం ఉదయం ఆర్టీసీ కార్మికుల ఐకాస నేతలు అధికారులతో చర్చలు జరిపారు. ఆర్టీసీ బోర్డు పరిధిలోని అంశాలు.. సమస్యల్ని యాజమాన్యం.. ఉద్యోగులు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చివరకు ఉభయ పక్షాల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి.. తాము చేస్తున్న సమ్మెను ముగిస్తున్నట్లుగా ఆర్టీసీ నేతలు శుక్రవారం అర్థరాత్రి ప్రకటించారు. చర్చల సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేసినా హామీల్ని అమలు చేయలేదని.. అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 2013 వేతన సవరణ బాండ్స్ రూ.280 కోట్ల బకాయిల్ని తీర్చటంతో పాటు.. పీఆర్సీ.. పెండింగ్ డీఏలు లేకుండా చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటంతోనే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాల ప్రచారం జరగటం లేదని పేర్కొనటం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వంలో కార్మిక సంఘాల్ని రద్దు చేయటం తెలిసిందే. మొత్తంగా సీఎం రేవంత్ తరచూ చెప్పినట్లు..తమది ప్రజాప్రభుత్వమన్న మాటకు తగ్గట్లే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించిందన్న మాట వినిపిస్తోంది.