తెలంగాణలోనూ పెట్టుబడులకు దారులు.. ముహూర్తం పెట్టారు!
తెలంగాణ సర్కారు కూడా ఈ దిశగా పరుగులు పెడుతోంది. దీనికి సంబంధించి తాజాగా హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సదస్సుకు శ్రీకారం చుట్టింది.
By: Garuda Media | 16 Nov 2025 5:56 PM ISTపెట్టుబడుల సాధనలో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇంటా-బయటా కూడా పెట్టుబడులు దూసుకు వస్తోంది. దేశ, విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు.. విశాఖలో తాజాగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా కూడా చంద్రబాబు తన కలను సాకారం చేస్తున్నారు. ఇదిలా వుంటే.. పెట్టుబడుల విషయంలో ఏపీతో పోటీ పడుతూ.. తెలంగాణ సర్కారు కూడా ఈ దిశగా పరుగులు పెడుతోంది. దీనికి సంబంధించి తాజాగా హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సదస్సుకు శ్రీకారం చుట్టింది.
వచ్చే నెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించే 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ప్రధాన ఉద్దేశం పెట్టుబడులను ఆహ్వానించడం.. ఆకర్షించడమే. దీనిని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో పర్యటించి పెట్టుబడులకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు అనేక మందిని కూడా ఆహ్వానించారు. అయితే.. విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సు స్థాయిలో కాకున్నా.. దాదాపు అదే రేంజ్‌లో అయితే నిర్వహించాలని నిర్ణయించారు.
1300 మంది విదేశీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించారు. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో నిర్వహించే ఈ సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా 50 నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను ఆహ్వానించాలన్నది ఈ సదస్సు కీలక లక్ష్యంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సదస్సు ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు కూడా పెద్ద పీట వేయనున్నారు.
'తెలంగాణ విజన్ డాక్యుమెంట్'ను ఈ వేదికగానే ఆవిష్కరించనున్నారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక స్థాయికి చేర్చాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే ప్రతిపాదిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దానిని సాకారం చేసుకునేందుకు పెట్టుబడులను గమ్యస్థానంగా ఎంచుకున్నారు. రెండు రోజుల సమ్మిట్‌లో సుమారు 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏమేరకు సీఎం ఆశలు నెరవేరుతాయో చూడాలి.
