రెండు రోజులు.. 27 సెషన్లు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విశేషాలివే..
ఈ నెల 8న మధ్యాహ్నం ఒంటి గంటకు సదస్సు ప్రారంభం కానుంది. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలివస్తున్నారు.
By: Tupaki Political Desk | 6 Dec 2025 7:00 PM ISTపెట్టుబడుల ఆకర్షణలో తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. గత నెలలో ఏపీలో సీఐఐ సమ్మిట్ నిర్వహించింది. రెండు రోజులు పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రానికి రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. సోమ, మంగళవారాల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో రెండు రోజుల పెట్టుబడుల వేటకు సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతానికి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మొత్తం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వాన పత్రిక అందజేసింది. ఇక దేశ, విదేశాల నుంచి ప్రముఖులు ఈ సదస్సుకు తరలివస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మిట్ అజెండా ఖరారైంది. రాష్ట్ర భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న ఈ సమ్మిట్ లో మొత్తం27 సెషన్లు నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. దావోస్ ఆర్థిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సదస్సు ముగింపు రోజు అయిన డిసెంబరు 9న వేదిక నుంచి కీలక డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ నెల 8న మధ్యాహ్నం ఒంటి గంటకు సదస్సు ప్రారంభం కానుంది. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలివస్తున్నారు. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమికండక్టర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, సిక్యా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ ప్రతినిధులు చర్చల్లో పాల్గొననున్నారు. ప్రముఖ క్రీడాకారులు పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్ లో పాల్గొంటారు.
అదేవిధంగా రాజమౌళి, రితేష్ దేశ్ ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ, సాఫ్ట్ పవన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చల్లో పాల్గొంటారు. కాగా, ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్ం తెలంగాణ రైజింగ్ 2047విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది. తెలంగాణ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ఈ డాక్యుమెంటులో పొందుపరిచారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులు సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్లో ఏటా జరిగే వలర్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను తలపించేలా అంతర్జాతీయ సదస్సు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
