Begin typing your search above and press return to search.

కేసీఆర్ కి నమస్కార బాణం...రేవంత్ స్ట్రాటజీ వేరే లెవెల్ !

మహా భారత యుద్ధంలో అర్జునుడు ఒక వైపు ఉంటే ఆయన గురువులు తాతలు తండ్రులు అంతా మరో వైపు ప్రత్యర్ధులుగా ఉంటారు.

By:  Satya P   |   17 Jan 2026 10:23 PM IST
కేసీఆర్ కి నమస్కార బాణం...రేవంత్ స్ట్రాటజీ వేరే లెవెల్ !
X

మహా భారత యుద్ధంలో అర్జునుడు ఒక వైపు ఉంటే ఆయన గురువులు తాతలు తండ్రులు అంతా మరో వైపు ప్రత్యర్ధులుగా ఉంటారు. వారితో తాను ఎలా యుద్ధం చేసేది అన్న సందేహం అర్జునుడికి వచ్చినపుడు శ్రీకృష్ణుడు చెప్పినది ఏంటి అంటే పెద్దలకు నమస్కార బాణం వేసి ఆ మీదట యుద్ధం చేయమని. అంటే అటు గౌరవించినట్లు ఉంటుంది, ఇటు క్షాత్ర ధర్మం పాటించినట్లు కూడా ఉంటుంది అన్నది శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అన్న మాట. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే ఫాలో అవుతున్నారా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. ఆయన మంచి మాటకారి మాత్రమే కాదు, వ్యూహకర్త. లౌక్యం తెలిసిన వారు, చాకచక్యంగా రాజకీయం చేసుకుంటూ ముందుకు పోవడం ఎలాగో బాగా ఎరిగిన వారు అని చెబుతారు.

కేసీఆర్ సెంటిమెంట్ :

కేసీఆర్ మలి విడత తెలంగాణా ఉద్యమానికి సారధిగా ఉన్నారు. ఆయన పదేళ్లకు పైగా పోరాడి కలగా ఉన్న తెలంగాణాను సాధించారు. ఆయన రెండు సార్లు సీఎం గా చేసిన వారు. ఆయన పాలన మీద వ్యతిరేకత ఉండవచ్చు కానీ ఆయన పట్ల ఇంకా అభిమానం ఉన్న వారు ఉన్నారు, ఆయన సెంటిమెంట్ కూడా తెలంగాణాలో ఉంది అంతే కాదు వయసు రిత్యా చూసినా ఆయన ఏడు పదులకు పై దాటిన వారు, దాంతో కేసీఆర్ ని విమర్శించే విషయంలో రేవంత్ రెడ్డి చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయనను పెద్దాయన గానే గౌరవిస్తూనే విమర్శిస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.

విశేష అనుభవశాలి అంటూ :

సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ అనుభవం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అధికారంలో ఉన్న వారికి ఉండదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నం. ఆయన ప్రెస్ మీట్లలో అయినా లేదా సభలలో అయినా కేసీఆర్ అనుభవాన్ని వివరించి మరీ చెబుతున్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా కేంద్ర మంత్రిగా, పదేళ్ళ సీఎం గా విపక్ష నేతగా నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ అనుభవం కేసీఆర్ ది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. పెద్దాయనగా ఆయన అనుభవంతో సలహాలు సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం వాటిలో మంచివి తీసుకుని అమలు చేస్తుందని అన్నారు. తమను ఆశీర్వదించాలని కూడా రేవంత్ రెడ్డి కోరడంలోనే రాజకీయ చమత్కారం ఉంది అని అంటున్నారు.

గట్టిగా విమర్శించకుండా :

కేసీఆర్ విషయంలో గట్టిగా విమర్శించకుండా పెద్దాయన అని నమస్కార బాణాలతోనే రేవంత్ రెడ్డి సరిపెడుతున్నారని అంటున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆయనను అభిమానించే వారి మనసు కూడా నొచ్చుకోకుండా సబబే కదా అనిపించేట్లుగా చేస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ నడ్డి విరిగి ఫాం హౌజ్ కి పరిమితం అయి ఉన్నారని ఆయన మీద ఏమి విమర్శలు చేస్తామని కూడా చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినాయకుడిని జాగ్రత్తగానే పక్కన పెడుతున్నారని అంటున్నారు.

వారి మీద మాత్రం :

ఇక కేటీఆర్ హరీష్ రావుల విషయంలో మాత్రం ఎక్కడా స్పేర్ చేయడం లేదని అంటున్నారు వారి మీద గట్టిగానే విమర్శలు చేస్తూ జనాలలో బీఆర్ఎస్ ని ఎంతలా బట్టబయలు చేయాలో అంతలా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా బీఆర్ ఎస్ వారసత్వ రాజకీయం మీదనే తన పోరు అన్నట్లుగా కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ సాగుతోంది అని అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తానే ఆయన సీటు వద్దకు వెళ్ళి మరీ నమస్కరించడం, ఆయనను సభకు రావాలని పదే పదే కోరడం, ఈ అనుభవాలతో మాకు సూచనలు ఇవ్వండి ఆశీర్వదించండి అని కోరడం ద్వారా ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ నే మెత్తబడేలా చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బందులో పడుతోంది అని అంటున్నారు.